Blast at Rajender Nagar Hyderabad రాజేంద్ర నగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 279.. శివరాంపల్లి దగ్గర ఈ ఉదయం ఒక పేలుడు సంభవించింది. చెత్తలో ఉన్న బాక్సును తెరవడం వల్ల పేలుడు సంభవించిందని, ఆ బాక్స్ తెరిచిన వ్యక్తి రెండు చేతులు తెగిపడ్డాయని సమాచారం. బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పేలుడులో గాయపడ్డ వ్యక్తిని అలీగా పోలీసులు గుర్తించారు. చెత్త ఏరుకుంటుంటూ అలీ జీవిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే కాసేపటి క్రితం అది బాంబు పేలుడు కాదని పోలీసులు నిర్ధారించారు.

ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పేలుడు అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించామని ఆయన చెప్పారు. కెమికల్‌ కారణంగానే పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నట్టు తెలిపారు. వేరే ప్రాంతం నుంచి ఆ బాక్సును యాచకుడు అలీ తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఎక్కడైనా ఎవరు పట్టించుకోకుండా వదిలేసిన బాక్సులను తెరవద్దని పోలీసులు వారించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు.

తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. ఎటువంటి ఉగ్రవాద చర్యలు జరగలేదు. ప్రజలు ప్రశాంతంగా నివసిస్తున్నారు. దానితో ఈ వార్తలతో ప్రజానీకం ఉలిక్కిపడింది. అయితే పోలీసుల తాజా క్లారిఫికేషన్ తో కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. వినాయక చవితి, వచ్చే ఈవారంలోనే మొహర్రం పండుగలు ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగరంతా సెక్యూరిటీ భారీగా పెంచారు. పేలుడు ఘటనపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు అన్నారు.