ys vivekananda reddyరెండేళ్లకు పైగా మిస్టరీగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై కొత్త కోణం వెలుగుచూసింది. ఈ కేసు విషయంగా తన వద్ద కొంత కీలక సమాచారం ఉందని ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వేంకటేశ్వర రావు ఇప్పటికే రెండు సార్లు దర్యాప్తు చేస్తున్న సిబిఐని సంప్రదించారట. అయితే అటునుండి ఎటువంటి కదలిక లేకపోవడంతో ఇటీవలే ఒక లేఖ రాశారని సమాచారం.

“మర్డర్‌ను గుండెపోటు గానో.. ప్రమాదం గానో చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నాలు చేశారు. అంతేకాదు.. మర్డర్ జరిగిన ఇల్లంతా కడిగేసి, శవాన్ని ఆసుపత్రికి తరలించే దాకా.. ఘటనా స్థలాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర బంధువులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో మీడియాను గానీ, ఇంటలిజెన్స్ సిబ్బందిని గానీ ఘటనా స్థలంలోకి అనుమతించలేదు. పోలీసులను కొందరు ప్రజా ప్రతినిధులు కావాలనే అడ్డుకున్నారు’ అని ఏబీ లేఖలో పేర్కొన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నవి.

ఇందులో ఏబీ వేంకటేశ్వర రావు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ప్రత్యక్షంగానే ప్రస్తావించగా… రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు కూడా పరోక్షంగా ప్రస్తావించినట్టు అయ్యింది. సంఘటనా దృశ్యాలు మీడియాలో రాకముందు… విజయసాయి రెడ్డి అప్పట్లో మీడియా ముందుకు వచ్చి వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పుకొచ్చారు.

మర్డర్ జరిగిన సమయంలో నిఘా విభాగం బాస్‌గా ఉన్న డీజీపీ స్థాయి అధికారి సమాచారం ఇస్తానంటే పట్టించుకోని సీబీఐ వైఖరిపై ప్రతిపక్ష పార్టీలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ రహస్య మిత్రులు అనడానికి అంతకంటే రుజువు ఏం కావాలి? అంటూ వారు నిందిస్తున్నారు.