BJP- YSRCP blaming each other on ys jagan attackవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. బిజెపి అయితే ఒకడుగు ముందుకేసి అధికార తెలుగుదేశం పార్టీపై సందేహాలు తలెత్తేలా వైసీపీకి వంత పాడుతోంది. ఇక మిగిలిన జనసేన, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలు కూడా ఈ దాడిని ఖండించాయి.

అన్నింటికంటే ఎక్కువ బాధ్యత ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ కూడా ఈ దాడిపై వెనువెంటనే దర్యాప్తు ప్రారంభించింది. అలాగే నారా లోకేష్ దీనిని హేయమైన చర్యగా అభివర్ణించారు. కానీ ఈ ఘటన ద్వారా వీలైనంత సానుభూతి మరియు రాజకీయ లబ్ది పొందాలనుకున్న వైసీపీ అండ్ కో మాత్రం సెల్ఫ్ గోల్స్ వేసుకునే విధంగా వ్యాఖ్యలు చేయడం విస్తుపోయే అంశం.

ఈ దాడి జరిగింది ఎయిర్ పోర్టులో! అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని అధికార విభాగం అన్న మాట! ఒక్కోసారి మంత్రులే ఎయిర్ పోర్టు సిబ్బందిపై వాగ్వివాదాలకు దిగే పరిస్థితి నేలకొందంటే, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలకు వారు ఎంతటి విలువను ఇస్తారో ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. అలాంటి ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిని అధికార తెలుగుదేశంపై నెట్టాలని చేస్తోన్న ప్రయత్నం అతిపెద్ద సెల్ఫ్ గోల్ గా పరిగణించాలి.

దీనిపై ఎంత రాద్ధాంతం చేస్తే కేంద్రం ఉన్న బిజెపికి అంత వ్యతిరేకత వెళ్ళే అవకాశం ఉంది గనుక, వైసీపీ చేస్తోన్న ప్రస్తుత గోల, కేంద్రంలో ఉన్న బిజెపిని ఇబ్బందులు పెడుతున్నట్లే! అలాగే కనీస జ్ఞానం లేని కొంతమంది బిజెపి నేతలు కూడా ఈ దాడికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ వ్యాఖ్యానించడం అనేది వారిపై వారు వేసుకునే నిందలనే పేర్కొనవచ్చు.

రాష్ట్ర డీజీపీ ఠాకూర్ వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం… ఎయిర్ పోర్టులో సెక్యూరిటీకి సంబంధించిన చర్యలన్నీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పరిధిలో ఉంటాయి. కనుక దీనికి ప్రధాన బాధ్యత వారు వహించాల్సి ఉంటుంది. అంటే పరోక్షంగా తమ ప్రభుత్వం మీద తామే అనుమానాలు వ్యక్తం చేసుకునే అద్భుతమైన ఆలోచనలను బిజెపి వర్గీయులు వ్యక్తపరుస్తున్నారు.

ఇంతకీ కధలో అసలు ట్విస్ట్ ఏమిటంటే… దాడి చేసిన శ్రీనివాసరావు అనే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డికి వీరాభిమాని అని స్వయంగా ఆయన అన్న ఓ ప్రముఖ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ స్పష్టం చేసాడు. అంటే టిడిపితో ఎలాంటి సంబంధం లేకున్నా… రాజకీయ ప్రయోజనాల కోసం “బిజెపి – వైసీపీ” పడుతోన్న తాపత్రయం ప్రజలకు తేటతెల్లమవుతోంది.