Vishnuvardhan-Reddy-BJPఓ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ, ఆచితూచి మాట్లాడాలి. ఇది కనీస బాధ్యత. కానీ కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు మాత్రం అత్యంత బాధ్యతారాహిత్యంగా విశాఖ కేంద్రంగా ఉత్తరాంద్ర జిల్లాలని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని పదేపదే డిమాండ్‌పై చేస్తున్నారు.

మంగళవారం శ్రీకాకుళం పట్టణంలో సీసీ రోడ్డుని ప్రారంభించిన తర్వాత ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా చేస్తామని చెపుతున్నారు. ఒకవేళ అమరావతినే రాజధాని చేసుకోవాలనుకొంటే, మా విశాఖ రాష్ట్రం మాకు ఇచ్చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి ఇన్ని దశాబ్ధాలు అయినప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో ఏమాత్రం అభివృద్ధి జరుగలేదు. చిన్న రోడ్డు వేస్తేనే ఇక్కడి ప్రజలు పొంగిపోతున్నారు. ఇలాంటి అభివృద్ధి జరగాలంటే ఉత్తరాంద్ర ప్రజలు నోరు తెరిచి గట్టిగా విశాఖని రాజధానిగా చేయాలని ఉద్యమించాలి. మీ సమస్యల గురించి మీరే నోరు విప్పి మాట్లాడకపోతే, మేము మీ గురించి శాసనసభలో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి?,” అని మంత్రి ధర్మాన అన్నారు.

ఆయన వ్యాఖ్యలపై బిజెపి సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “విశాఖ ప్రత్యేక రాష్ట్రంగా కావాలనేది ఆయన సొంత డిమాండా లేక ప్రభుత్వాభిప్రాయమా? చెప్పాలి. ఒకవేళ ఇది ఆయన సొంత భిప్రాయమే అయితే సిఎం జగన్‌ తక్షణం ఆయనని మంత్రి పదవిలో నుంచి తొలగించాలి. ఒకవేళ ప్రభుత్వ అభిప్రాయమైతే ధైర్యంగా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంద్ర జిల్లాల అభివృద్ధికి, ముఖ్యంగా తన సొంత జిల్లా శ్రీకాకుళం అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలి. రాష్ట్రాభివృద్ధి చేయకుండా మూడు రాజధానులపేరుతో వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోంది. విశాఖలో విలువైన భూములని వైసీపీ నేతలు కబ్జాలు చేసేందుకు విశాఖ రాజధాని ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది. మేము అధికారంలోకి వస్తే అమరావతి కేంద్రంగానే రాష్ట్రాభివృద్ధి చేసి చూపిస్తాం,” అని అన్నారు.