BJP TRS by-elections and municipal elections in telanganaతెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ ఎంసీ ఎన్నికలలో అనూహ్య ఫలితాలతో ఇక మాదే అధికారమిక అనే రేంజ్ కి వచ్చేశారు ఆ రాష్ట్ర బీజేపీ నేతలు. పైగా కొంచెం నోరున్న వారితో పార్టీ ని నింపడంతో ఇక అడ్డూ ఆపూ అనేది లేదు. అయితే ఈ లోగా వచ్చిన నాగార్జున సాగర్ ఉపఎన్నికతో మొత్తం ముఖచిత్రం మారిపోయింది. ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యే జరిగిందని అంటున్నారు.

అయితే ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమే. అందులోనూ అధికార పక్షానికి అనుకూలంగా వుండే ఉపఎన్నికలలో వ్యతిరేక ఫలితాలు తప్పేమీ కాదు. అయితే ఇప్పటివరకూ సాగర్ ఉపఎన్నికకు సంబంధించిన ప్రతీ సర్వేలో బీజేపీకి రెండంకెలలో ఓట్ షేర్ ఇచ్చిన ఒక్క ఏజెన్సీ కూడా లేదు. ఒకవేళ అదే గనుక నిజమైతే బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది అనే అనుకోవాలి.

బీజేపీ ఇప్పటివరకు నమోదు చేసిన విజయాలు ఏదో గాలివాటం అని అధికారపక్షం అనే అవకాశం ఉంటుంది… అంత పేలవమైన ప్రదర్శన ఉంటే ప్రజలు కూడా దానిని నిజమని నమ్మడంలో ఎటువంటి అనుమానం ఉండదు. అటువంటి పరిస్థితి లో తొందరలో జరిగే వరంగల్, ఖమ్మం మునిసిపల్ ఎన్నికలు బీజేపీకి కీలకం అవుతాయి. అయితే రెండు చోట్లా బీజేపీ సంస్థాగతంగా చాలా బలహీనంగానే ఉంది.

వరుసగా మూడు ఎన్నికలలో వెనుకబడితే ఇక ముందు ప్రజలకు ఒక రకమైన పాజిటివ్ ఉద్దేశం కలిగించడం కూడా ఇబ్బందే. పైగా ఈ ఎన్నికల తరువాత తెలంగాణ లో ఏవైనా ఉపఎన్నికలు ఉంటే తప్ప ఎన్నికలేవీ లేవు. ఈ కారణంగానే తెలంగాణ బీజేపీ ఖమ్మం మునిసిపల్ ఎన్నికలలో జనసేన సహాయం కూడా తీసుకుంది. నాగార్జున సాగర్ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 2న రాబోతున్నాయి. ఆ మరునాడు మునిసిపల్ ఫలితాలు ప్రకటించనున్నారు.