BJP to remove Kanna Lakshmi Narayana as AP BJP presidentఏదో ఊడబొడుస్తారని కన్నా లక్ష్మీనారాయణను కాంగ్రెస్ నుండి తెచ్చుకుని ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు మోడీ అమిత్ షా. అయితే ఆయన రాకతో రాష్ట్రం ఏ మాత్రం బలపడలేదు కదా ఎప్పుడు లేనట్టుగా పార్టీలో నిధుల దుర్వినియోగం జరుగుతుందని వార్తలు కూడా వస్తున్నాయి. బీజేపీలో తొలి నుంచి ఉన్న నేతలు, కార్యకర్తలు అయితే కన్నా పోకడలను జీర్ణించుకోలేక పోతున్నారు. దాంతో వేదిక దొరికిన ప్రతిసారీ కన్నా వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్రంలో బీజేపీ సర్వనాశనం కావడానికి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణయే ప్రధాన కారకుడని, వైసీపీ నేతలతో కుమ్ముక్కై రాజంపేట ఎంపీ టికెట్టు అమ్ముకున్నారని, ఆఖరి క్షణంలో అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నాడని బీజేపీ నాయకులు ఒక సమీక్షా సమావేశంలో ఆ పార్టీ నాయకులే ఆరోపించారు. రాజంపేట ఎంపీ టికెట్టును వైసీపీ నాయకుడు మహేశ్వర్‌ రెడ్డికి ఇచ్చారని, ఆఖరి నిమిషంలో అతను తప్పుకున్నాడని, దీనిలో బీజేపీ నాయకుల హస్తం ఉందని, వాయిస్‌ రికార్డ్‌ కూడా తమవద్ద ఉందని వారు అంటున్నారు.

ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి ఖర్చుకోసం బీజేపీ అధిష్టానం కొంత డబ్బు సర్దుబాటు చేసిందట. అది కూడా పక్క దారి పట్టిందని వాటిపై కూడా విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే కన్నా వర్గం ఇదంతా గిట్టని వారి ప్రచారమని, పార్టీ అధిష్టానానికి తమ నాయకుడు మీద సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఏపీ బీజేపీ పై ఎన్నికల తరువాత అమిత్ షా మోడీ దృష్టి సారించాల్సి ఉంది. అవసరమైతే కన్నా ను తప్పించక తప్పదని కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.