BJP-Stayakumar-on-alliance-with-janasena-partyజనసేన-బిజెపిల మద్య ముఖ్యమంత్రి అభ్యర్ధిపై మొదలైన చిచ్చును బిజెపి అధిష్టానం ఆర్పే ప్రయత్నం చేసింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న విజయవాడలో పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు పొత్తులు, ముఖ్యమంత్రి అభ్యర్ధిపై నిర్ణయం తీసుకొనేందుకు ఇంకా చాలా సమయం ఉంది కనుక ఆ విషయాలపై ఎవరూ మీడియా వద్ద అనవసరమైన మాటలు మాట్లాడవద్దని హెచ్చరించారు.

బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడటం చాలా తొందరపాటవుతుంది. పవన్ కళ్యాణ్‌ అధికార వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. కనుక ఆయనతో ఆ పార్టీ మైండ్ గేమ్స్ ఆడుతూ పొత్తుల గురించి రెచ్చగొడుతోంది. గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు వైసీపీ ట్రాప్‌లో పడినట్లే ఈసారి పవన్ కళ్యాణ్‌ పడుతున్నారు. కనుక ఆయన కూడా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

వైసీపీ ఆడుతున్న ఈ మైండ్ గేమ్స్‌తో మా పార్టీ నేతలు కూడా ప్రభావితమవుతున్నారు. వారిని వైసీపీ వలలో పడవద్దని, పొత్తుల గురించి ఎవరూ మాట్లాడవద్దని చెప్పాము. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉన్నందున ముఖ్యమంత్రి అభ్యర్ధి గురించి ఇప్పటికిప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో మా అధిష్టానం నిర్ణయిస్తుంది,” అని చెప్పారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా రోజులుగా బిజెపి, జనసేనల మద్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్‌ దత్తపుత్రుడని పదేపదే విమర్శిస్తూ రెచ్చగొట్టడం అందుకే. అయితే వైసీపీ ఆడుతున్న ఈ మైండ్ గేమ్స్ టిడిపికి బాగా తెలుసు కనుక ఆ పార్టీ నేతలు చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు.

కానీ పవన్ కళ్యాణ్‌ వైసీపీ ఉచ్చులో పడి పొత్తులతో మొదలుపెట్టి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే వరకు వచ్చేశారు. దీంతో వైసీపీ కోరుకొంటున్నట్లే అటు బిజెపితో ఇటు టిడిపితో జనసేన దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ మూడు పార్టీలను ఒకదానికొకటిని దూరం చేస్తేనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి, వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాగలుగుతుంది.

ఈవిషయం టిడిపి, బిజెపిలు గ్రహించాయి కానీ జనసేన గ్రహించలేదు. అందుకే ‘మూడో ఆప్షన్‌’ జనసేన ఒంటరిగా పోటీ చేయడం వరకు పవన్ కళ్యాణ్‌ వచ్చేశారు. కనుక ఇప్పటికైనా బిజెపి సూచిస్తున్నట్లు జనసేన కాస్త తగ్గి పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడితే మంచిది.