BJP_Somu_Veerrajuఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జనసేనతో పొత్తులు, టిడిపి, వైసీపీల పాలన, నారా లోకేష్‌ పాదయాత్ర, ఫోన్‌ ట్యాపింగ్‌ తదితర అంశాల గురించి తమ పార్టీ వైఖరిని వివరించారు.

జనసేనతో పొత్తులు: మా పొత్తులు జనంతోనే. వస్తే జనసేన పొత్తు లేకుంటే లేదు. మేము కుటుంబ పార్టీలతో పొత్తులు పెట్టుకోదలచుకోలేదు.

టిడిపి పాలన: రాజధాని అమరావతిని నిర్మించమని మేము (కేంద్ర ప్రభుత్వం) చంద్రబాబు నాయుడుకి రూ.6,000 కోట్లు ఇచ్చాము. కానీ ఆయన రాజధాని కట్టలేకపోవడంతో అమరావతి రైతులు రోడ్లమీద పాదయాత్రలు చేయవలసి వచ్చింది.

వైసీపీ పాలన: కుటుంబ పాలనలో ఉన్న ఏ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్‌లాగే మిగిలిపోతుంది. మూడు రాజధానులు అంటూ కొండలు తవ్వేసి, మళ్ళీ వాటిపై పరదాలు కప్పేసి దాచిపెట్టేయలనుకొంటారు. ఒకళ్ళు ఇసుక అమ్మేసుకొంటారు. మరొకరు ఎర్రమట్టి అమ్మేసుకొంటారు. ఎవరికి దొరికింది వారు అమ్మేసుకొంటున్నారు. ఈ కుటుంబ పార్టీల వలననే రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదు. కనుక మాకు కుటుంబ పార్టీలతో పొత్తులు వద్దే వద్దు.

పాదయాత్రలు: ఈ పాదయాత్రలతో ప్రజలకి ఏం లాభం? వాళ్ళు తాము అధికారంలోకి రావడం కోసం పాదయాత్రలు చేస్తున్నారు. మేము (కేంద్ర ప్రభుత్వం) లక్షల కోట్లు పెట్టి రోడ్లు వేయిస్తే వాళ్ళు పాదయాత్రలు చేస్తూ వాటిని అరగదీసేస్తున్నారు. మేము మార్చి 10 నుంచి నెలాఖరులోగా మేము కూడా 20,000 కిమీ పాదయాత్ర చేస్తాము. లక్ష ఛార్జ్ షీట్‌లని ప్రకటిస్తాము.

ఫోన్‌ ట్యాపింగ్‌: కుటుంబ పార్టీల పాలనలో ఫోన్‌ ట్యాపింగ్‌ సర్వసాధారణం. కనుక రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగితే ఆశ్చర్యమేమీ లేదు. అయితే మాది కుటుంబ పార్టీ కాదు కనుక మేము (కేంద్ర ప్రభుత్వం) ఎవరి ఫోన్లు ట్యాపింగ్‌ చేయము.

జనసేనతో పొత్తుల గురించి సోమూ వీర్రాజు ఎంత తిప్పి తిప్పి చెప్పినప్పటికీ టిడిపితో పొత్తులు పెట్టుకొంటే జనసేనకి రామ్‌రామ్ చెప్పేస్తామని చెప్పారని అర్దం అవుతూనే ఉంది. ఇతర పార్టీలు రోడ్లు అరగదీసేస్తున్నాయని ఎక్కసెక్కం చేసినప్పుడు మళ్ళీ మేము కూడా అరగదీస్తాం అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.

సోమూ వీర్రాజు అమరావతి గురించో లేదా పోలవరం ప్రాజెక్టు గురించో మాట్లాడి, జగన్‌ ప్రభుత్వం చేత వాటిని పూర్తి చేయించడం కోసం తమ ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పి ఉంటే ఆయన మాటలకి ఏమైనా విలువ ఉండేది. కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ అమ్మకుండా అడ్డుకోవడం కోసం లేదా విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు గురించో రాష్ట్ర బిజెపి ఏం చేస్తోందో చెప్పినా ప్రజలు హర్షించేవారు. కానీ వాటి గురించి మాట్లాడే ధైర్యం లేక కాలక్షేపం కోసం కుటుంబపార్టీలంటూ ఏదో మాట్లాడారు. అంతే!