Somu Veerrajuకరోనా సోకి చాలా కాలం మీడియా హడావిడికి దూరంగా ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. అమరావతి రైతులకు వాగ్దానం చేసిన విధంగా 64 వేల ప్లాట్స్ వారికి ఇవ్వాలి, 9వేల ఎకరాలు అభివృద్ధి చేయాలి అని ఆయన మీడియా ముఖంగా డిమాండ్ చేశారు.

“ముఖ్యమంత్రి గా 1800 రోజులు చంద్రబాబు చేసింది ఏంటి? 7200 కోట్లు అమరావతి పేరుతో ఎక్కడ ఖర్చు చేశారు?,” అంటూ ప్రశ్నించారు. అమరావతిలో ఎంత ఖర్చు అయ్యింది అనేదాని మీద వీర్రజే ఒక్కోరోజు ఒక్కో లెక్క చెబుతారు. ఇటువంటి ప్రశ్నలు మీడియా ముందుకు వచ్చి అడిగే బదులు… కేంద్రంలోని తమ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్కలు అడగవచ్చు కదా?

రాజకీయ విమర్శలకు రాజకీయంగానే సమాధానాలు వస్తాయి…. ప్రభుత్వాల మధ్య నడిచే ప్రశ్నోత్తరాలలో నిజాలు బయటపడే అవకాశం ఉంటుంది కదా! అమరావతిలో అవినీతి పేరిట ఇప్పటివరకూ వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ రెండు చేస్తున్నవి ఆరోపణలే… ఇప్పటివరకూ రెండు పార్టీలు అటువంటి రుజువులు చూపించలేకపోయాయి.

ఇకపోతే… మూడు రాజధానులు చేస్తూ… రైతులకు ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చినా ఉపయోగం ఏంటి? మూడు రాజధానుల కింద అమరావతిలో వచ్చే ప్లాట్ల వల్ల రైతులకు తమ భూముల విలువ ఉండదు. ఒక పక్క మూడు రాజధానులు మద్దతు అంటూ ఇంకో పక్క అమరావతి రైతులకు ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తే అది రైతులను తడి గుడ్డతో గొంతు కొయ్యడమే.