bjp-ram-madhav- ఆంధ్రప్రదేశ్ లో ఏ మాత్రం ప్రభావం చూపించలేని బీజేపీ నేతలు. బెదిరింపులకు దిగుతున్నారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎన్నికల ముగిశాక చర్యలు తప్పవని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ అంటున్నారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ బాబు అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. కాగ్ నివేదిక ఆధారంగా బాబు అవినీతి పై సంబంధిత శాఖలు స్పందిస్తాయన్న రామ్‌మాధవ్.. టీడీపీని ఓడించాలని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.

‘మోడీ ఇన్‌.. బాబు అవుట్’ అనేది తమ స్లోగన్‌ అని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో కర్ణాటక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేసినందుకు ఎన్నికల తరువాత బాబు పని అయిపోయింది అన్నారు బీజేపీ నేతలు. కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించినా చివరికి అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారు. టీడీపీ నాయకుల మీద ఐటీ రైడ్లు, ఎన్నికల కమిషన్ ద్వారా టీడీపీని ఇబ్బంది పెట్టడంలాంటి తెరవెనుక రాజకీయం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఒక్క రైడులో కూడా సాధించింది ఏమీ లేదు.

మోడీ ఇన్‌.. బాబు అవుట్ సరే ఇంతకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గానీ, ఆంధ్రప్రదేశ్ తరపు నుండి బీజేపీ వారు ఒక్కరైనా పార్లమెంట్ కు ఇన్ అయ్యే పరిస్థితి ఉందా? కనీసం గుప్పెడు సీట్లలో డిపాజిట్లు తెచ్చుకునే పరిస్థితి ఉందా? ఇవేమీ చెయ్యలేనప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ ప్రగల్బాలకు ఏమైనా విలువ ఉంటుందా? ఇలా అయినదానికీ కానిదానికీ ఆవేశపడి చంద్రబాబును విరోధిగా చేసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చీకటి పొత్తులే తప్ప బయటకు ఎవరితోనూ కలిసి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ఇటువంటి డాంబికాలు మాని ప్రజల అభిమానం చూరగొనే పనులు చేస్తే వారికే మంచిది.