bjp president Somu Veerraju commentsఆంధ్రప్రదేశ్ ఎలా అయినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని భావిస్తోన్న రాష్ట్ర నాయకత్వం చేస్తోన్న ప్రకటనలు నవ్వులపాలు అవుతుండడం గమనించదగ్గ విషయం. తాము అధికారంలోకి వస్తే లిక్కర్ ను 75 రూపాయలకే సరఫరా చేస్తానని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుండి ఎటువంటి స్పందన లభించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఏపీకి పార్టీ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తోన్న సోము వీర్రాజు నోట అలాంటి ‘చీప్’ వ్యాఖ్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కానివని విశ్లేషకులు కూడా తేల్చేసారు. బహుశా ఇది మరిచిపోయారని అనుకున్నారో ఏమో గానీ, తాజాగా ఏపీ ప్రజానీకానికి “నాటు కోడి గుడ్లు” ఆఫర్ ను ప్రకటించారు సోము. తాము అధికారంలోకి వస్తే ‘నాటు కోడి గుడ్లను’ ఇస్తానంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

ఓ పార్టీ ప్రెసిడెంట్ గా ఇదేనా సోము వీర్రాజు చేసే వ్యాఖ్యలు? లేక నిజంగానే బీజేపీ తమ అజెండాలో ఇలాంటి పధకాలను పెట్టనుందా? ఒకసారి మాట్లాడితే పొరపాటున టంగ్ స్లిప్ అయ్యిందని అనుకోవచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ అలాగే జరుగుతుండడం పొరపాటు కాదు, ఖచ్చితంగా అది అలసత్వమో, ప్రజలను తక్కువగా అంచనా వేయడమో అన్న దానికి నిదర్శనమని చెప్తున్నారు.

అయితే ఇలాంటి వ్యాఖ్యలు పరోక్షంగా అధికార పార్టీ ప్రభుత్వానికి దోహదం చేస్తాయని పేర్కొనాలి. బీజేపీ వంటి జాతీయ పార్టీలో కనీస అవగాహన కూడా లేని నాయకులు ఉన్నారన్న పబ్లిసిటీ ప్రజల లోనికి వెళ్తుంది, తద్వారా అధికార పార్టీ దానిని అనువుగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా వైసీపీకి పరోక్షమైన సహకారం అందించారనే ఆరోపణలు సోము వీర్రాజుపై ఉన్నాయి.