gvl narasimha rao -BJPమొన్న అమరావతిలోని రైతుల ఉద్యమం 200 రోజులైనా సందర్భంగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఒక కీలకమైన ప్రకటన చేశారు. “నేను గతంలో చెప్పాను. మళ్లీ చెబుతున్నా. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బిజెపి తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్రప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది,” అని చెప్పారు.

అమరావతి మీద బీజేపీ చిత్తశుద్ధి గురించి ప్రజలలో అనుమానాలు ఉన్న మాట వాస్తవమే. దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ మరో ఎంపీ జీవీఎల్ నరసింహ రావు సుజనా చెప్పినదానికి వ్యతిరేక స్టేట్మెంట్ ఇచ్చారు. తమ పార్టీ వికేంద్రీకరణకు అనుకూలమని, గతంలో హైదరాబాద్ లో జరిగిన పొరపాటు మళ్ళీ పునరావృతం కాకూడదని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

ఇది పరిశీలిస్తే ఇద్దరు నేతలు పరస్పర విరుద్ధమైన ప్రకటన చేసినట్టు స్పష్టం అవుతుంది. గతంలో రాష్ట్ర విభజన జరిగే సమయంలో అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఇలాగే వ్యవహరించేది. ఏ ప్రాంతం నేతలతో ఆ ప్రాంత వాదన చేస్తూ పబ్బం గడుపుకునేది. బీజేపీ కూడా అదే వైఖరి అవలంబిస్తోంది.

కాకపోతే ఆ రెండు నాలుకల వాదన ఆ తరువాత కాంగ్రెస్ మెడకు చుట్టుకుని ఆ పార్టీ రెండు రాష్ట్రాలకు కాకుండా పోయింది. ఈ విషయం ఆ పార్టీ ఎంత త్వరగా తెలుసుకుని సరిదిద్దుకుంటే అంత మంచిది. లేకపోతే బీజేపీకి కాంగ్రెస్ కి తేడా లేదని ప్రజలు అనుకోవాల్సి వస్తుంది.