bjp needs everyone except pawan kalyanరాష్ట్ర విభజనకు ముందు సినీ ఇండస్ట్రీ తెలుగుదేశం.., కాంగ్రెస్ అంటూ ఎవరికీ నచ్చిన పార్టీకి వారు బహిరంగంగా కానీ లేక ఆంతరంగికంగా కానీ తమ మద్దతుని తెలియచేసేవారు. కానీ ఒక్కసారి రాష్ట్ర విభజన జరిగి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం దాదాపుగా కేసీఆర్ కు మద్దతు పలికారనే చెప్పాలి. తెరాస ప్రభుత్వం కూడా టాలీవుడ్ కు అంతే సహకారం అందిస్తూ వచ్చింది.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్న కేసీఆర్ కుమారుడైన కేటీఆర్ కూడా టాలీవుడ్ పెద్దలతో అంతే సన్నిహితంగా ., స్నేహ పూర్వక సంబంధాలను పెంచుకుంటూ పోయారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ బలపడడానికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం నుండి అందించడంలో తన వంతు పాత్రను పోషించారు. అయితే ఇలా ఒక్కోపద్ధతిలో ఒక్కొక్కరు తెలుగు ఇండస్ట్రీని తమ వైపుకు తిప్పుకున్నారు.

అయితే తాజాగా తెరాస ని కాదని బీజేపీలో చేరి హుజురాబాద్ ఎన్నికలలో నెగ్గిన ఈటల ఎపిసోడ్ నుండి తెలంగాణాలో పాగా వేయడానికి బీజేపీ పార్టీ తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ వస్తుంది. అప్పటివరకు వార్ వన్ సైడ్ గా ఉన్న తెరాస పార్టీకి ఈటల విజయం గట్టి ఎదురుదెబ్బే అనిచెప్పక తప్పదు. ఒక్కసారి బీజేపీ టార్గెట్ ఫిక్స్ చేసిందంటే రాష్ట్రంలో ప్రజల మద్దతు ఏపార్టీకి దక్కినా ప్రభుత్వం మాత్రం బీజేపీదే అన్న చందంగా దేశ రాజకీయాలను మార్చిన ఘనత మాత్రం “షా” జోడికే దక్కిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

విషయానికి వస్తే., తెలంగాణ రాజకీయాలలో వన్ అఫ్ ది కీ ఫ్యాక్టర్ అయిన టాలీవుడ్ ఇండస్ట్రీని తమ వైపుకు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ పెద్దలు ఒక్కొక్కరుగా ఒక్కో హీరోతో భేటీ అవుతూ తద్వారా ప్రజల చూపుని తమ పార్టీ వైపుకి మరల్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలంగాణాలో వాతావరణాన్ని సృష్టిస్తున్నారు బీజేపీ యంత్రాంగం. ఇందులో భాగంగానే మొన్న జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీకాని, నేడు నితిన్ తో జేపీ నడ్డా కలవడం కానీ అంటున్నారు రాజకీయ పండితులు.

గత కొద్దీ రోజులక్రితం జరిగిన “మా” అధ్యక్ష ఎన్నికలలో కూడా బీజేపీ పార్టీని విమర్శించే ప్రకాష్ రాజ్ బరిలో ఉండడంతో ఆయనకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ ఇస్తూ ప్రకాష్ రాజ్ ని మానసికంగా దెబ్బకొట్టారు బీజేపీ నాయకులు. అయితే ఇందులోనూ ఒక కొసమెరుపు ఉంది…., టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నహీరోలలో ఒకరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వద్దునుకొని మరొకరి వైపు చూడడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అయితే ప్రస్తుతం సినిమాలతో బిజీగాఉంటూ.., రాజకీయాలతో అంటి ముట్టనట్టు ఉంటున్న జూ.ఎన్టీఆర్ తోకాని..,చంద్రబాబు నాయుడుకి సన్నిహతంగా ఉండే పత్రికాధిపతి అయినా రామోజీరావు ని కలవడం కానీ..,అసలు రాజకీయాలతో సంబంధం లేని నితిన్ ను కలవడం ద్వారా ప్రజలకు ఎం సంకేతం పంపుతున్నారో బీజేపీ నాయకత్వం అంటూ నోరెళ్లపెడుతున్నారు తల పండిన రాజకీయ నేతలు సైతం.

మొన్న ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం నియోజకవర్గంలో జరిగిన అల్లూరి విగ్రహావిష్కరణకు గాను టాలీవుడ్ పెద్దగా పిలవబడుతున్న మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడం వంటి సంగతులు., ఈమధ్య కాలంలో తెలుగు సినిమాల గురించి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే ప్రస్తావించిన సందర్భాలు గుర్తుచేస్తూ “ఊరికేరారు మహానుభావులు….” అన్న సామెత మాదిరి బీజేపీ పెద్దలు రాజకీయాలు నడిపిస్తుంటారు అని బయట రాజకీయ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంటుంది.

బీజేపీ పార్టీ ఎవరిని కలిసినా.., ఎవరిని కట్ చేసిన వారి అంతిమ లక్ష్యం మాత్రం అధికారం దక్కించుకోవడమే అనేది ఎన్నో సందర్భాలలో రుజువు చేస్తూనే వస్తున్నారు. ఒకవైపు పాతబస్తీలో అల్లర్లు…, మరోపక్క సెలబ్రెటీల మీటింగ్లలతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

అయితే…. కేసీఆర్ ని కాదని టాలీవుడ్ హీరోలు బీజేపీ కి మద్దతు పలుకుతారా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. కానీ బీజేపీని కూడా అంత తేలికగా అంచనా వేయకూడదనేది నేటి దేశ రాజకీయాలు చూస్తున్న వారి మాట. మొదట మాట్లాడడం..,వినకపోతే ఐటీ దాడులు.., సీబీఐ సోదాలు.., ఈడీల రంగప్రవేశం ఇలా చాలానే ఉన్నాయి బీజేపీ చేతిలో అంటూ సెటైర్లు పేలుస్తున్నారు తెరాస నేతలు. ఏ రాజకీయ పార్టీ అయినా గెలవాలనుకోవడం తప్పు కాదు..,కానీ ఎలా అయినా మేమే గెలవాలనుకోవడమే విమర్శలకు దారితీస్తుంది.