BJP National Secretary Satya Kumarబీజేపీ నాయకుల వాదనలు, మాటలు చిత్రంగా ఉంటాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలుగు నాయకులు కూడా ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకోకుండా మాట్లాడటం దారుణం. తాజాగా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా కేటీఆర్ చేసిన ప్రకటనపై ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడి విమర్శలు చేస్తున్నారు.

“ఏపీ పై కేసీఆర్ కు ప్రేమ ఉంటే తెలంగాణలో ఉన్న బయ్యారం గనులను విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయించాలి. విశాఖ ఉక్కుకు మద్దతు అంటూ కబుర్లు చెప్పడం కాదు. రెండు రాష్ట్రప్రభుత్వాలు చర్చించి ఉక్కు పరిశ్రమను కొనుగోలుచేసి నడపాలి,” అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు.

సరే ఒకవేళ కేసీఆర్ బయ్యారం గనులు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తే కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందా? రెండు రాష్ట్రప్రభుత్వాలు కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న ఉక్కు పరిశ్రమను ఎందుకు కొనుగోలు చెయ్యాలి? ప్రజల మీద, వారి ఆకాంక్షల మీదా రాష్ట్ర ప్రభుత్వాలకే గానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదా?

పోనీ అదేదో ప్రైవేట్ ప్లాంట్ ని మూతపడకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలి అంటే అర్ధం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు బాధ్యత ఉందదు? ఇటువంటి అడ్డగోలు వాదనల కారణంగానే ప్రజలకు, బీజేపీ నాయకులకు గ్యాప్ వచ్చి ఆ పార్టీ పరిస్థితి అలా ఉంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతుండగా ఇటువంటి వ్యాఖ్యలతో దానిని కూడా నాశనం చేసుకోకపోతే మంచిది.