‘ప్రత్యేక హోదా’ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఫూల్స్ చేయడంలో విజయవంతమైన కేంద్ర ప్రభుత్వం, తాజాగా ‘ప్రత్యేక సాయం’ విషయంలోనూ అదే బాటను అనుసరించడానికి సిద్ధమవుతున్నట్లుగా కనపడుతోంది. గత రెండు సంవత్సరాలుగా ‘స్పెషల్ స్టేటస్’ అంశంపై నాన్చుతూ వస్తున్న ప్రభుత్వం… ‘చావు కబురు చల్లగా చెప్పినట్లు…’ విభజన చట్టంలో లేని అంశాన్ని తాము అమలు చేయలేమని, తాజాగా చేతులెత్తేసిన విషయం తెలిసిందే. అయితే ‘స్పెషల్ ప్యాకేజ్’ అంశంలో కూడా బిజెపి ఇదే రకమైన వైఖరిని ప్రదర్శించడం మరిన్ని ఆగ్రహజ్వాలలకు కారణమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ కు ఆర్ధిక సహాయం విషయంపై జీరో అవర్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం, మరో కుటిల రాజకీయ ఆటకు బిజెపి తెరలేపినట్లుగా కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. “ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏపీకి ఎలాంటి ఆర్థిక సాయం సిఫారసులు లేవని, అయినప్పటికీ కేంద్రం ప్రభుత్వం ఉదారంగా స్పందించి, 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక సాయం కింద ఏపీకి 500 కోట్ల రూపాయలు విడుదల చేసిందని” చెప్పడంతో రాష్ట్ర ఎంపీలంతా అవాక్కయ్యారు.
ఏపీ 500 కోట్లు కేటాయించడమే బిజెపి దృష్టిలో చాలా గొప్ప సాయంగా పరిగణించడం పక్కన పెడితే, ఆర్ధిక సాయం విషయం కూడా విభజన బిల్లులో లేదన్న సరికొత్త వాదనను ఈ సందర్భంగా తెరపైకి తెచ్చినట్లయ్యింది. అంటే ‘ప్రత్యేక హోదా’ మాదిరే ‘ప్రత్యేక సాయం’ను కూడా నీరుగార్చే పనిలో బిజెపి వర్గీయులు ఉన్నారా? లేక బిల్లులో లేకపోయినా 500 కోట్లు కేటాయించి, ఏపీకి తగిన న్యాయం చేసామని ప్రచారం చేసుకునే పనిలో బిజెపి పెద్దలు ఉన్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. అంటే త్వరలో ‘స్పెషల్ ప్యాకేజ్’ వస్తుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో షాక్ తప్పదా?
బహుశా ఈ 500 కోట్లతోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఏపీ రాజధానిని నిర్మించుకోమంటారో… లేక ఏపీ వ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్ట్ ను తెచ్చుకోమంటారో… అదీ కాక, రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పధకాలు అందజేయమంటారో గానీ… కేంద్రం తీరు చూస్తూ విస్తుపోవడం రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రజల వంతవుతోంది. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు పుణ్యమా అంటూ ఒక్కో విషయం బహిర్గతమవుతుండగా.., ముఖ్యంగా ఏపీ పట్ల బిజెపి వ్యవహారం తెలిసి వస్తోంది. విభజన నాటి నుండి ఆడుతున్న రాజకీయ చదరంగం ఇంకా ముగియలేదని, రాష్ట్ర ప్రజలను మరిన్ని సార్లు ఫూల్స్ చేసేందుకు బిజెపి సిద్ధంగా ఉందన్న సంకేతాలు కనపడుతున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.