Narendra_Modi_Amit_Shahపదేళ్ళపాటు ఏకఛత్రాధిపత్యం చేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం స్వయంకృతం వలన అధికారం కోల్పోయింది. అదే సమయంలో బిజెపికి ఆశాదీపంగా నరేంద్ర మోడీ ఉద్భవించారు. ఆయన, అమిత్‌ షాతో కలిసి 2014, 2019లో వరుసగా రెండుసార్లు బిజెపిని గెలిపించుకొని ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.

అప్పటి నుంచి దేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడుతుంటే, మోడీ-అమిత్‌ షాలు కలిసి బిజెపిని అన్ని రాష్ట్రాలకి విస్తరించుకొంటూ పార్టీని మరింత బలంగా మార్చుకొన్నారు.

అయితే మోడీ, బిజెపి పాలన పట్ల ప్రజలలో క్రమంగా వ్యతిరేకత పెరుగుతున్నందున వచ్చే ఎన్నికలలో బిజెపికి ఇప్పుడున్న సీట్లకంటే మరో 50 వరకు తగ్గే అవకాశం ఉందని కాంగ్రెస్‌ సీనియర్ నేత, ఎంపీ శశీ ధరూర్ అన్నారు. గత ఎన్నికలకి ముందు పూల్వామా, బాలాకోట్ దాడులని బిజెపి తెలివిగా ఉపయోగించుకొని భారీ మెజార్టీ సాధించగలిగిందని కానీ ఈసారి అటువంటి అవకాశం ఉండకపోవచ్చని అన్నారు. కనుక వచ్చే ఎన్నికలలోగా కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు బలపడగలిగితే బిజెపి మెజార్టీ సాధించలేకపోవచ్చని ధరూర్ అన్నారు.

కానీ కాంగ్రెస్‌ పరిస్థితి చూస్తే వచ్చే ఎన్నికలలోగా పుంజుకొనే అవకాశం కనిపించడం లేదు. ఇదే అదునుగా తెలంగాణ సిఎం కేసీఆర్‌ చాలా తెలివిగా పావులు కదుపుతూ బిఆర్ఎస్‌ పార్టీతో జాతీయ రాజకీయాలలోకి దూసుకువెళుతున్నారు. కానీ తొలి ప్రయత్నంలోనే ఆయన దేశ ప్రజలందరికీ తన నాయకత్వం పట్ల, తన పార్టీ పట్ల నమ్మకం కలిగించడం చాలా కష్టం.

అయితే కేసీఆర్‌ వ్యూహాలు చూస్తుంటే, వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీని గెలవకపోయినా కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేయవచ్చు. అందుకోసం ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు.

ఏ కారణంగా కేంద్రంలో బిజెపి మళ్ళీ అధికారంలోకి రాలేకపోయినా దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయి. ఏపీ విషయానికే వస్తే రాష్ట్రంలో వైసీపీ గెలిచినా, ఓడినా వెంటనే బిఆర్ఎస్‌ కూటమిలో చేరిపోవడం, కేసీఆర్‌ సాయంతో అక్రమాస్తుల కేసులన్నీ ఎత్తేయించుకోవడం ఖాయం. ఒకవేళ రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ గెలిస్తే ఇక తిరుగే ఉండదు. కానీ ఓడిపోయినా బిఆర్ఎస్‌ కూటమిలో చేరి కేసీఆర్‌, కేంద్ర ప్రభుత్వం సాయంతో ఏపీలో టిడిపి ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టవచ్చు.

అయితే బిజెపి, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాల శక్తియుక్తులని తక్కువగా అంచనా వేయలేము. కేసీఆర్‌ని నిలువరించాలంటే ముందుగా ఆయనని తెలంగాణలోనే ఓడించడం చాలా అవసరమని బిజెపి బాగానే గుర్తించింది. అందుకే మిషన్-90 పేరుతో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో 90 సీట్లు గెల్చుకొని కేసీఆర్‌ని గద్దె దింపేందుకు సన్నాహాలు చేసుకొంటోంది.

ఒకవేళ తెలంగాణ బిఆర్ఎస్‌ ఓడిపోయి కేంద్రంలో మళ్ళీ బిజెపి, మోడీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే అప్పుడు కేసీఆర్‌ని ఆయనకి సహకరిస్తే జగన్‌ని కూడా పూర్తిగా కట్టడిచేయవచ్చు.

కనుక వచ్చే ఎన్నికలలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపతుందని భావించవచ్చు.