ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇవ్వమని అడిగితే దేశ రక్షణ నిధులు కూడా అడుగుతారు మీరు అని అపహాస్యం చేసిన కేంద్రం బీజేపీ ప్రాబల్యం పెరుగుతున్న ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం నిధుల వరద పారిస్తుంది. గతవారమే వాటికి రూ.3 వేల కోట్ల పన్ను రాయితీలకు ఆమోదముద్ర వేసిన కేంద్రం- తాజాగా 4,500 కోట్ల విలువైన వరాలను కురిపించింది.

‘ఈశాన్య రాష్ట్రాల మండలి’ కింద చేపడుతున్న ప్రత్యేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఇప్పటివరకూ 90:10 నిష్పత్తిలో నిధులిస్తూ వచ్చిన కేంద్రం… ఇకపై చేపట్టే ప్రాజెక్టులన్నింటికీ 100% నిధులను సమకూర్చనుంది. ఈశాన్య రాష్ట్రాల రహదారి అభివృద్ధి పథకానికి పూర్తిగా నిధులివ్వనుంది. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనం ఇది.

ఒక పక్క ప్రత్యేక హోదా ఉండదు అంటూనే ఆ రాష్ట్రాలలో తమ ప్రాబల్యం పెంచుకోవడానికి ఇబ్బడిముబ్బడిగా నిధులు ఇస్తుంది. బాగా వెనుకబడిన రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాలకు సాయం చెయ్యడం తప్పేమి కాదు. అయితే ఆంధ్ర ప్రదేశ్ కు విభజన చట్టంలో, పార్లమెంట్ లో చేసిన వాగ్దానాలు పాలకులు గుర్తు రాకపోవడం శోచనీయం! మాకు ఓట్లు వేస్తేగానీ మిమల్ని పాటించుకోము అని మోడీ ప్రభుత్వం చెప్పకనే చెబుతుందా?