BJP MLC MAdhav Comments on YSRCPఈ నెల 11,12 తేదీలలో ప్రధాని నరేంద్రమోడీ విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు. కనుక రాష్ట్ర బిజెపి నేతలు ముందుగా స్పందిస్తారనుకొంటే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హడావుడి మొదలుపెట్టేశారు. విశాఖనగరంలో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌ బహిరంగసభ నిర్వహించడానికి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సభకు సుమారు లక్షమందిని జనసమీకరణ చేయబోతున్నట్లు చెప్పారు. ఇది ప్రధాని అధికారిక పర్యటన, అధికారిక కార్యక్రమం కనుక తమ వైసీపీ ప్రభుత్వం దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.

ప్రధాని నరేంద్రమోడీ పర్యటనపై విజయసాయి రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటంపై బిజెపి ఎమ్మెల్సీ మాదవ్ స్పందిస్తూ, “ఇదేమీ వైసీపీ కార్యక్రమం కాదు. జగన్ సభ అంతకంటే కాదు. కానీ ప్రధాని నరేంద్రమోడీ పర్యటనను వైసీపీ హైజాక్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర బిజెపి నేతలందరూ పాల్గొంటారు. ప్రోటోకాల్ ప్రకారం వాటిలో సిఎం జగన్మోహన్ రెడ్డి, అధికారులు పాల్గొనవచ్చు,” అని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బిజెపి నేతలందరూ నిద్రావస్థలో ఉన్నందునే ఇదివరకు భీమవరంలో ఇప్పుడు విశాఖ పర్యటనలో వైసీపీకి ఈ అవకాశం కలిగిందని చెప్పవచ్చు.

ఇక హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నివాసం ముందు కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తుండటంపై బిజెపి ఎమ్మెల్సీ మాదవ్ స్పందిస్తూ, “దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పవన్‌ కళ్యాణ్‌కి భద్రత కల్పించలేకపోతే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా కల్పిస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పర్యటనలో ఆయనను హోటల్‌ గదిలో నిర్బందించడం, ఆయన కార్యక్రమాలలో పాల్గొననీయకుండా తిప్పి పంపడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. టిడిపి నేత అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేయడాన్ని కూడా ఖండిస్తున్నాము. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను ఈవిదంగా పోలీసులతో వేధించడం మానుకొంటే మంచిది,” అని బిజెపి ఎమ్మెల్సీ మాదవ్ హెచ్చరించారు.

పవన్‌ కళ్యాణ్‌ తమతో కలిసి పనిచేయాలనుకొన్నా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు పట్టించుకోకపోవడం, మిత్రపక్షం అధినేతను వైసీపీ ప్రభుత్వం వేధిస్తున్నయ స్పందించకపోవడం, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ వైసీపీ పాలన, అనాలోచిత నిర్ణయాలు, అనుచిత విధానాలపై నోరెత్తి మాట్లాడలేని నిర్లిప్తత కారణంగానే వైసీపీ ఇంతగా రెచ్చిపోతోందని చెప్పవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తుండటం కూడా వైసీపీ దూకుడికి మరో కారణంగా కనిపిస్తోంది. కనుక ప్రధాని మోడీ పర్యటనను వైసీపీ హైజాక్ చేయాలని ప్రయత్నిస్తోందని, ప్రతిపక్ష నేతలను వేధిస్తోందని బిజెపి అసహనం వ్యక్తం చేయడం వలన ఏ ప్రయోజనమూ ఉండదు. ముందుగా ఈ అవలక్షణాలన్నిటినీ వదిలించుకొని ఏపీ రాజకీయాలలో తన పాత్ర ఏవిదంగా ఉండాలో నిర్ణయించుకొంటే, ఏపీలో బిజెపి అధికారంలోకి రావడం గురించి ఆ తర్వాత ఆలోచించవచ్చు.