BJP MLA Vishnu Kumar Raju Penmetsa - Bikini Party‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’ అన్న సామెత తెలుసా..! తెలియకపోతే ఒక్కసారి విశాఖ నార్త్ ఎమ్మెల్యే పెనుమత్స విష్ణు కుమార్ రాజు గారి మాటలు వినండి. ఆ ఒక్క సామెత ఏమిటి… చాలా గుర్తోచ్చాస్తాయ్… అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ సదరు బిజెపి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారా అంటారా..! ‘బికినీ’ అంటే ఈ విశాఖ ఎమ్మెల్యే గారు ‘స్కర్ట్’ అనుకున్నారట… అయితే లేటెస్ట్ గా ఏపీ ప్రభుత్వం విశాఖ తీరాన ఏర్పాటు చేయనున్న ‘బీచ్ లవ్ ఫెస్టివల్’లో భాగంగా బికినీ అని ఇంటర్నెట్ లో కొడితే గానీ, అర్ధం కాలేదంట! అది ఏ విధమైన కాస్ట్యూమ్ అని..!

ఈ మాటలన్నీ నమ్మొచ్చా… అంటే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే అని చెప్పాలి. ‘ప్రత్యేక హోదా’ అయిదేళ్ళు కాదు, పది, పదిహేనేళ్ళు ఇస్తామని చెప్పినపుడు నమ్మలేదా..? ‘ప్రత్యేక హోదా’ మా వల్ల కాదు, దానినే ‘ప్రత్యేక ప్యాకేజ్’ రూపంలో ఇస్తామని చెప్తున్నపుడు నమ్మడం లేదా..? అలాగే ‘ప్రజాసేవ’ తప్ప మరొకటి తమకు తెలియదని ఈ రాజకీయ నాయకులు ఇచ్చే ఊకదంపుడు ప్రసంగాలను నమ్మడం లేదా..? ఇది కూడా అంతే..! నమ్మేయాలి. అయితే ఈ బీచ్ ఫెస్టివల్ నిజంగా ఏర్పాటు అవుతుందో లేదో గానీ, దీని వలన విష్ణు కుమార్ రాజు గారికి మాత్రం ఒక ఆంగ్ల పదానికి అర్ధం తెలిసినందుకు ఏపీ ప్రభుత్వం గర్వపడాలి.

ఇదే కాదండోయ్… ఇంకా చాలానే చెప్పారు… “ఇలాంటి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించడం మన సంస్కృతికి విరుద్ధమని, పర్యాటక రంగం అభివృద్ధి కోసమంటూ ఇటువంటి ఫెస్టివల్ ను నిర్వహించాలని అనుకోవడం సబబు కాదని, మహిళల బికినీలు చూసి వచ్చే పెట్టుబడులు అవసరం లేదని” కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఫెస్టివల్ పై వైసీపీ రాజకీయంగా రచ్చ చేస్తుండడంతో… ఇందులో తమ పాత్ర కూడా ఉండాలని భావించిన బిజెపి రాష్ట్ర నాయకత్వం, ఈ బీచ్ ఫెస్టివల్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

అయితే షకీరా వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ విశాఖ విచ్చేయడంలో కేంద్రం పాత్ర లేదా? అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అనుమతులు లభిస్తేనే కదా ఇదంతా జరిగేది? ఓ పక్కన ఆ పార్టీనే అనుమతులు ఇస్తూ, మరో పక్కన రాజకీయ లబ్ది కోసం మళ్ళీ పార్టీ వర్గాలే అమాయకంగా మాట్లాడడం అనేది రాజకీయం అనిపించుకుంటుంది గానీ, దీని వలన పెద్దగా ఉపయోగం ప్రయోజనం ఉండదనేది సదరు రాజకీయ నాయకులు గుర్తించాల్సిన విషయం. ‘బికినీ’ అంటే తెలియదన్న సదరు నేతకు ‘బీచ్ ఫెస్టివల్’ గురించి తెలియడం చెప్పుకోదగ్గ విషయమే.