raja-singhహైదరాబాద్ లోని సంతోష్ స్వప్న ధియేటర్ లో కరణ్ జోహార్ ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాను ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తన హెచ్చరికలు బేఖాతరు చేస్తూ సినిమాను ప్రదర్శిస్తే తాను కేజ్రీవాల్ లా ధర్నా చేసేవాడిని కాదని, పెట్రోల్ తీసుకెళ్లి ధియేటర్ ను కాల్చేస్తానని, తన నియోజకవర్గంలో పాకిస్థాన్ నటుడి సినిమాను ప్రదర్శించడాన్ని తాను అంగీకరించనని తీవ్రంగా స్పందించారు.

అందుకే గోషామహల్ లో ఉన్న సంతోష్ స్వప్న ధియేటర్ ను హెచ్చరించానని తెలిపారు. కరణ్ జోహార్ కు ఈ సినిమా విడుదల కాకపోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదని, అలా కాకుండా ఈ సినిమా విడుదలై విజయం సాధిస్తే, కరణ్ జొహార్ ఇచ్చిన రెమ్యూనరేషన్ తో ఫవాద్ ఖాన్ పాకిస్థాన్ లో ట్యాక్సులు కడతాడని, అది గవర్నమెంట్ కి చేరి, దానిని వారు ఐఎస్ఐకి ఇస్తారని, వాళ్లు బాంబులు, తుపాకులు తయారుచేసి తీవ్రవాదులకు ఇస్తారని, వాళ్లు వాటితో భారతీయ సైనికులను హతమార్చుతారని అన్నారు.

అంటే మన డబ్బుతో మనల్నే అంతం చేస్తారని తనదైన లాజిక్ తో సదరు ఎమ్మెల్యే గారు చెప్పారు. అలా జరగకూడదనే తన ప్రయత్నం తాను చేస్తున్నానని, అలాగే దీపావళికి చైనా టపాసులు కొనుగోలు చేయవద్దని సూచించారు. చైనా టపాసులు కొనుగోలు చేయడం ద్వారా బాగా సంపాదించిన చైనా, ఆ డబ్బును భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ లో కారిడార్లు కట్టేందుకు, పాక్ తీవ్రవాదులకు సాయం చేసేందుకు వినియోగిస్తోందని, దీనిని అర్థం చేసుకుని ప్రజలంతా చైనా టపాసులు కొనుగోలు చేయడం మానేయాలని సూచనలు చేసారు.