BJP MLA p manikyala rao resignation drama
మాజీ మంత్రి మాణిక్యాలరావు ఇటీవలే తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తున్నా అని ప్రకటించి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. రెండు రోజులకే అధికారులు ఆయన దీక్షను భగ్నం చేశారు. అప్పటివరకు ఆయన దీక్ష రాష్ట్రం, జిల్లా మాట అటుంచి సొంత నియోజకవర్గంలో కూడా ప్రభావం చూపించలేదు. దీనితో ఎందుకు అనుకున్నారో ఏమో గానీ మొత్తానికి దీక్ష మానేసి ఇంటికి వెళ్లిపోయారు. అయితే రాజీనామా చేశా అని ప్రకటించి ఈరోజు ఆయన అసెంబ్లీకి కూడా వచ్చేశారు.

పైగా మీడియా ముందు వింత వాదనకు దిగారు. రాజీనామా పత్రాలను సీఎం చంద్రబాబుకు మాత్రమే పంపానని, స్పీకర్‌కు పంపలేదని స్పష్టం చేశారు. ‘రాజీనామా ఆమోదించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది. నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకే వచ్చాను. నా దీక్ష నియోకవర్గంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది’ అని చెప్పుకొచ్చారు. అసలు ముఖ్యమంత్రికి రాజీనామా పంపడం ఏంటో? పైగా ఆయన దానిని ఆమోదించడమేంటో?

జనసేనలోకి వెళ్లిన రావెల కిషోర్ బాబు, వైఎస్సాఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లిన మేడా మల్లికార్జునరెడ్డి ఇద్దరూ తన రాజీనామాలను స్పీకరుకి పంపి ఆమోదింప చేసుకున్నారు. ఆమోదించే ముందు స్పీకరు వారితో మాట్లాడి ఆమోదించారు. అది రాజ్యాంగంలో పొందుపరచిన పద్దతి. మరి మాణిక్యాలరావు కొత్తగా చెప్పే ఈ రాజీనామా ఆమోదించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది అనే అంశమేంటో ఎవరికీ అర్ధం కావడం లేదు. కనీసం మూడు నెలల పదవి కూడా వదులుకోలేని చిత్తశుద్ధి బీజేపీ నాయకులది అనుకుని వదిలెయ్యడమేనా?