BJP-KCR-YS-Jaganనేడు విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కూడా బిజెపి బలపడుతోంది. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బిఆర్ఎస్‌ని ఓడించి బిజెపి అధికారంలోకి రావడం ఖాయం. ఏపీలో బిజెపి-జనసేనల పొత్తుల గురించి ఎవరో ఏదో మాట్లాడితే మేము స్పందించాల్సిన అవసరం లేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పనితీరు ఏమీ బాగోలేదు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడి, అప్పులు పెరిగిపోయాయి. మా పార్టీ అమరావతికే కట్టుబడి ఉంది. కాంట్రాక్టర్లకు బిల్లులు, ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి ఏపీ ప్రభుత్వం చేరుకొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగా సహాయసహకారాలు అందిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోంది,” అని అన్నారు.

ఏపీతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి బాగానే ఉంది. కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే అనేక సంక్షేమ పధకాలను కూడా అమలుచేస్తోంది. కనుక కేసీఆర్‌కు తెలంగాణలో మంచి ప్రజాధారణ ఉంది. తెలంగాణలో బలంగా ఉన్న కేసీఆర్‌ని ఓడించి అధికారంలోకి రాగలమని కేంద్రమంత్రి భగవంత్ కుబా నమ్మకంగా చెప్పుకొంటున్నారు. కానీ అప్పులు, కేసుల కోసం తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడున్న జగన్మోహన్ రెడ్డిని ఓడించగలమని అంతే నమ్మకంగా చెప్పలేకపోతున్నారు!

ఏపీ పరిస్థితి, ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరు రెండూ బాగోలేదని చెపుతున్న కేంద్రమంత్రి, ఇటువంటి పరిస్థితులలో కూడా ఏపీలో బిజెపి గెలిచి అధికారంలోకి రాగలదని నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకు?బిజెపిలో ఈ అయోమయం, అలసత్వం కారణంగానే ఏపీలో వైసీపీ ఇంత ధీమాగా ఉందని భావించవచ్చు. ఒకవేళ ఏపీలో కూడా బిజెపి బలంగా ఉండి ఉంటే, నేడు వైసీపీ తీరు మరోలా ఉండేది కదా?