narendra modi amit shah bjpమోదీ – అమిత్ షా ద్వయంలో బీజేపీ దూకుడుకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరన్న రేంజ్ లో పార్టీ దూసుకుపోతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఒక్క పంజాబ్ మినహాయిస్తే మిగిలిన గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్, మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.

ఉత్తరప్రదేశ్ లో అయితే సంప్రదాయానికి వ్యతిరేకంగా బీజేపీ గాలి బలంగా వీస్తోంది. గత 30 సంవత్సరాలలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా వరుసగా రెండవ సారి తిరిగి అధికారం చేపట్టిన దాఖలాలు లేవు. కానీ యోగి ఆదిత్యనాధ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ చరిత్రను తిరగరాసే విధంగా ముందుకు సాగుతోంది. మొత్తం 403 స్థానాలలో బీజేపీ 265 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుంది.

ఇక ఉత్తరాఖండ్ 70 స్థానాలలో 42 స్థానాలలో బీజేపీ, మణిపూర్ 60 స్థానాలకు గాను 24 స్థానాలలో, గోవా 40కి గాను 19 స్థానాల్లో ముందంజలో ఉంది. పంజాబ్ లో మాత్రం ‘చీపురు’ గుర్తుతో ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే దశలో ఉంది. ఈ ఎన్నికల ఫలితాలతో దేశంలో ఏ పార్టీ కూడా కమలం ముందు నిలబడలేకపోతున్నాయనే యదార్థాన్ని మిగతా పార్టీలు ఒప్పుకోక తప్పదు.

60 సంవత్సరాల అనుభవం ఉన్న కురువృద్ధ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. ఒక్క గోవాలో మాత్రం కొంతవరకు పోరాటపటిమను ప్రదర్శిస్తోంది గానీ ప్రయోజనం మాత్రం శూన్యం. రాహుల్, ప్రియాంకల ప్రచారం కూడా ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ఎటువంటి అనుకూల ఫలితాలు సాధించలేకపోయింది.

బీజేపీ విజయ దుంధిమి చూసిన పార్టీ నాయకులు “పుష్ప” సినిమాలోని పాపులర్ డైలాగ్ అయిన “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరూ” అన్న నానుడితో “కమలం అంటే ఫ్లవర్ అనుకున్నారా, ఫైరూ” అంటూ చెలరేగిపోతున్నారు. ఈ ఎన్నికల ఫలితాల సరళి ఇలాగే కొనసాగితే, మిగిలిన రాష్ట్రాలలో కూడా బీజేపీ తన దూకుడును మరింతగా పెంచుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.