BJP Leader Vishnu Vardhan Reddyపోలవరం ఫండింగ్ పై కేంద్ర ప్రభుత్వం మాట మార్చడంతో రాష్ట్ర బీజేపీ డిఫెన్స్ లో పడింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకోలేక… తమ రహస్య మిత్రుడైన జగన్ ని అనలేక… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిందించడం విశేషం. ఒక టీవీ చర్చలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చేసిన విమర్శలు అలాగే ఉన్నాయి.

పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని… కమిషన్ల కోసమే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ను అప్పటి చంద్రబాబు చేతిలోకి తీసుకున్నారని… కేంద్ర ప్రాజెక్టు గా ఉంటే కేంద్రమే కట్టి అప్పజెప్పేదని ఆయన చెప్పుకొచ్చారు. “పక్కనున్న తెలంగాణలో రాష్ట్ర ప్రాజెక్టు ను కేంద్ర ప్రాజెక్టు చెయ్యాలని కేసీఆర్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే… చంద్రబాబు జాతీయ ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రాజెక్ట్ చేశారు,” అని ఆయన ఆరోపించారు.

అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే… పోలవరం ఇప్పటికీ జాతీయ ప్రాజెక్ట్ అనే విషయం ఆయనకు తెలియకపోవడం. గతంలో అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ… ప్రాజెక్ట్ ని సకాలంలో పూర్తి చెయ్యడానికే తాము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఇచ్చాం అని చెప్పుకొచ్చారు.

అలాగే ప్రాజెక్ట్ లో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్రం ఢిల్లీ హై కోర్టులో ఇచ్చిన అఫిడవిట్, అలాగే పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటనను సదరు ఛానల్ యాంకర్ ప్రస్తావించినా విష్ణు పట్టించుకోలేదు. మీ సొంత పార్టీ నేతృత్యంలోని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నవి కూడా నమ్మరా అంటున్నా ఆయన పట్టించుకోకపోవడం విశేషం. మొత్తం మీద పోలవరం ఫండింగ్ విషయంలో ఎందుకు మాట మార్చారు అనేదాని మీద మాత్రం స్పందన లేదు.