BJP Floor Leader Vishnu Kumar Rajuఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. ఆ పార్టీకి మూడు శాతం ఓట్లు వస్తే గొప్ప అనే పరిస్థితి ఉంటే ఆ పార్టీ సిటింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఏకంగా తమ పార్టీ మూడు సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్‌ సీపీ కోట్లాది రూపాయాల డబ్బు ఖర్చు చేశాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేశాయని విమర్శించారు. కేంద్రంలో ఇక నుంచి నరేంద్ర మోదీ వ్యతిరేక ఆటల సాగవని అన్నారు.

తన సొంత నియోజకవర్గమైన విశాఖ పట్నం ఉత్తర లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఓడిపోతారని ఆయన జోస్యం చెప్పారు. ఈ నియోజకవర్గం ప్రజలు గంటా రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతున్నారని ఆయన అన్నారు. బీజేపీ తరఫున పోటీ చేసిన తాను, లేక వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని, మంత్రి గంటా మాత్రం గెలిచే అవకాశం లేదన్నారు. గంటా గెలుపు సంగతి కాసేపు పక్కన పెడితే విష్ణు కుమార్ రాజు కనీసం మూడవ స్థానంలోనైనా ఉంటారా అని నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు.

మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో ఏదైనా సంస్థ బీజేపీకి 5% ఓట్లు వస్తాయని అంటే దానిని బోగస్ సర్వే అని తేల్చేశారు నెటిజన్లు. ఇది రాష్ట్రంలో బీజేపీ పరిస్థితికి దర్పణం పడుతుంది. 10 సీట్లలో డిపాజిట్లు వస్తే గొప్ప అన్నట్టు ఉంది పరిస్థితి. మూడు అసెంబ్లీ సీట్లు అంటే కూడా అతిశయోక్తి అంటే పార్టీ దుర్భర పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. కేంద్రంలో సొంతంగా అధికారంలోకి రాగల పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఉందంటే ఆ పార్టీ రాష్ట్ర నేతల పని తీరు అర్ధం చేసుకోవచ్చు.