BJP Leader PVN Madhavఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు సీట్లు టిడిపి గెలుచుకోవడంతో వైసీపీ కలవరపడుతోందని తెలుసు. అయితే ఈ ఎన్నికలు బిజెపి, జనసేనల మద్య కూడా చిచ్చు రగిలించడం విశేషం.

రెండు పార్టీల మద్య పొత్తులున్నాయని చెప్పుకొంటున్నప్పటికీ, ఈ ఎన్నికలలో రెండూ కలిసి పనిచేయలేదు. ఈ మిత్రబేధాన్ని పిడిఎఫ్ నేతలు తెలివిగా వాడుకొని ప్రయోజనం పొందారు. జనసేన తమకే మద్దతు ఇస్తోందని చెప్పుకొని లాభపడ్డారు. ఇక బిజెపి-జనసేనల ప్రేమకధ ఇలా ఉంటే, బిజెపి-వైసీపీల ‘వన్ సైడ్ లవ్ స్టోరీ’ మరోలా ఉందని బిజెపి సీనియర్ నేత పీవీన్ మాధవ్ చెప్పారు.

ఈరోజు విజయవాడలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన పార్టీ నేతలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మనం (బిజెపి) వైసీపీతో ఉన్నామని ఆ పార్టీ ప్రచారం చేసుకొని ఎన్నికలలో లాభపడింది. రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నామని, తమకు ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం, మద్దతు ఉన్నాయని వైసీపీ నేతలు చేసుకొన్న ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్మబట్టే వైసీపీని గెలిపించారు. వైసీపీ లాభపడగా మనం నష్టపోయాము. దీనికి అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉంది. త్వరలోనే కార్యాచరణ మొదలుపెడదాము,” అని అన్నారు.

జనసేన-బిజెపి పొత్తుల గురించి మాట్లాడుతూ, “మన మద్య పొత్తులున్నాయని మనం చెప్పుకొంటాము. కానీ అవి పేరుకు మాత్రమే. పొత్తులు ఉన్నాయో లేవో… బిజెపికి జనసేన మద్దతు ఇస్తోందో లేదో అనే సందేహం బిజెపికి చాలా నష్టం కలిగించింది. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పనిచేయాలనుకొంటే ఇక నుంచైనా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం మొదలుపెట్టాలి. వద్దనుకొంటే పొత్తులు లేవనే విషయం ప్రజలకి స్పష్టంగా తెలియజేయాలి. అప్పుడే మన పార్టీ పట్ల ప్రజలకు ఓ స్పష్టమైన అవగాహన, నమ్మకం ఏర్పడుతాయి,” అని మాధవ్ అన్నారు.

మాధవ్ ఆవేదనకు బలమైన కారణమే ఉంది. ఆయన ఉత్తరాంద్ర పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయగా 10,884 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. అంటే బాగానే వచ్చాయని అర్దమవుతోంది. కానీ మూడు కారణాల వలన ఈ ఎన్నికలలో మాధవ్ ఓడిపోయారని చెప్పవచ్చు. 1. బిజెపి-వైసీపీల మద్య అండర్ స్టాండింగ్ ఉందనే దుష్ప్రచారం. 2. బిజెపి-జనసేనలు కలిసి ఉన్నప్పటికీ జనసేన మద్దతు ప్రకటించకపోవడం. 3. టిడిపితో జనసేన కలిసి పనిచేయబోతోందనే స్పష్టమైన సంకేతాలు ఇస్తుండటం. కనుక ఏపీలో బిజెపి తన పరిస్థితి ఏమిటో తేల్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.