BJP-Kanna-Lakshminarayana-JanaSena-Nadendla-Manoharప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యటనలకి వచ్చినప్పుడు మాత్రమే ఏపీ బిజెపి యాక్టివ్ అవుతుంటుంది. మిగిలిన సమయంలో రాష్ట్రంలో బిజెపి ఉందో లేదో అన్నట్లు ఉంటుంది ఆ పార్టీ నేతల తీరు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకి వచ్చినప్పుడు కూడా జగన్‌ ప్రభుత్వం దానిని హైజాక్ చేస్తుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు ఆరోపిస్తుండటం ఆ పార్టీ వైఫల్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

హిందుత్వ అజెండాతో సాగే బిజెపికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నా కనిపించడం లేదు. హిందూ దేవాలయాలపై దాడులు, దొంగతనాలు జరుగుతున్నా కనిపించడం లేదు. దేవాలయాల సొమ్ము ఇతర పనులకి వినియోగిస్తున్నా ఏపీ బిజెపి స్పందన శూన్యమని ప్రజలే భావిస్తున్నారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.

ఇక బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విషయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు చాలా అనుచితంగా మాట్లాడుతున్నప్పటికీ ఏపీ బిజెపి స్పందించకపోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పర్యటనకి వచ్చినప్పుడు ఆయనని హోటల్‌ గదిలో నిర్బందించడాన్ని టిడిపి ఖండించి, ఆయనకి సంఘీభావం తెలిపింది కానీ ఏపీ బిజెపి స్పందించలేదు. ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు తీరుపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఏపీ బిజెపి తీరు పట్ల తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా సోమూ వీర్రాజు తీరు ఏమాత్రం మారినట్లు లేదు.

ఈ నేపధ్యంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బుదవారం తన పార్టీ ముఖ్య నేతలతో కలిసి గుంటూరులోని కన్నా లక్ష్మి నారాయణ ఇంటికి వెళ్ళి భేటీ అవడం ఆసక్తికరమైన విషయమే అని చెప్పుకోవచ్చు. నాదెండ్ల మనోహర్ బృందంతో కన్నా లక్ష్మినారాయణ సుమారు గంట సేపు చర్చించారు. అయితే వారు ఏం చర్చించారనే విషయం ఇద్దరూ బయటపెట్టలేదు.

కనుక సోమూ వీర్రాజుపై కన్నా లక్ష్మినారాయణకి ఫిర్యాదు చేసేందుకే వారు ఆయన ఇంటికి వెళ్ళారా? లేదా బిజెపి, జనసేనల కార్యాచరణకి సంబందించి రోడ్ మ్యాప్ అడిగేందుకు వెళ్ళారా? లేదా సోమూ పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయనని జనసేనలో చేరాల్సిందిగా ఆహ్వానించారా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏమైనప్పటికీ, ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజుని కాదని కన్నా లక్ష్మి నారాయనని జనసేన నేతలు కలవడం తేలికగా కొట్టిపడేయాల్సిన విషయమైతే కాదనే చెప్పాలి. మరి వారి భేటీపై సోమూ వీర్రాజు ఇంకా స్పందించవలసి ఉంది.