Pawan-Kalyan---Telangana-BJP--Telangana---Janasenaబీజేపీతో పాటు జనసేన పై కూడా తెరాస విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే బల్కా సుమన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “పక్క రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ పోటీకి దిగుతాననడం హాస్యాస్పదం. ఆయనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనతో లేడు. అలాంటి పార్టీని, వ్యక్తిని బీజేపీ కలుపుకోవడం విడ్డూరం,” అని ఎద్దేవా చేశారు.

“పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనోడు ఇక్కడ ఏం చేస్తాడు?. విస్తృత ప్రయోజనాల కోసం పోటీచేయట్లేదంట.. ఈ మాటలు వింటుంటే జనాలు నవ్వుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు గ్రేటర్‌ ప్రజలు తగిన బుద్ది చెప్తారు. కిషన్‌రెడ్డి నిస్సహాయుడు. రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లి అడుక్కుంటున్నాడు,” అని ఘాటు విమర్శలు చేశారు.

ఇది ఇలా ఉండగా… జనసేన ఎన్నికలలో పోటీ చెయ్యకుండా బీజేపీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చెయ్యాలని బీజేపీ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే పోటీ నుండి విరమించుకుని విమర్శలు పాలవుతున్న పవన్ అలా చేస్తే ఇంకా పల్చనవుతారు.

రేపటితో నామినేషన్ల ఉపసంహరణ సమయం కూడా ముగిసిపోనుండడంతో పార్టీలన్నీ ప్రచారం పై దృష్టి పెట్టనున్నాయి. ఇప్పటికే తెరాస కేటీఆర్ తో అనేక రోడ్ షోలు, కేసీఆర్ తో భారీ బహిరంగ సభ ప్లాన్ చేసింది అధికార పార్టీ. బీజేపీ తన ప్రచార ప్లాన్ ని ఇంకా ప్రకటించలేదు.