ఏపీలో బిజెపి, జనసేనలు హటాత్తుగా ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు? అనే దానిపై కీచులాడుకోవడం చూస్తుంటే, తాను దూర కంత లేదు మెడకో డోలు, జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లు.. వంటి సామెతలు గుర్తుకు రాకమానవు.
‘కరోనా తరువాత రెండు పార్టీల మద్య కూడా భౌతికంగా దూరం పెరిగిందని’ పవన్ కళ్యాణ్ జోక్ వేస్తే ‘అవును గ్యాప్ చాలా పెరిగిందని’ బిజెపి సీనియర్ నేత పురందేశ్వరి సీరియస్‌గా చెప్పారు.
పవన్ కళ్యాణ్‌ని బిజెపి-జనసేన కూటమికి ముఖ్యమంత్రిగా అభ్యర్ధిగా ప్రకటించాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తుంటే, మా పార్టీలోనే ముఖ్యమంత్రి అభ్యర్ధులు చాలా మంది ఉన్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి రమేశ్ నాయుడు కౌంటర్ వేశారు.
వాళ్ళ హడావుడి చూస్తుంటే అప్పుడే ఎన్నికలలో గెలిచేసినట్లు, అధికారంలోకి వచ్చేసినట్లు, నేడో రేపో ప్రమాణ స్వీకారాలు చేయబోతున్నట్లు ఉంది. రెండు పార్టీలు ‘ముఖ్యమంత్రి పదవి మాకే అంటే… కాదు మాకే కావాలని’ కీచులాడుకోవడం చూసి జనాలు నవ్వుకొంటున్నారు.
నిజానికి ఆ రెండు పార్టీలు తమకు వచ్చిన ఓట్ల శాతాలు లెక్కలు కట్టుకొని తృప్తిపడటమే తప్ప ఇంత వరకు ఏపీ రాజకీయాలపై పట్టు సాధించలేకపోయనేది వాస్తవం. ఒకవేళ ఆ రెండు పార్టీలకు తమ శక్తిసామర్ధ్యాలపై అంత గట్టి నమ్మకం ఉంటే తెగతెంపులు చేసేసుకొని వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి గెలిచేసి ముఖ్యమంత్రి పదవి తీసేసుకోవచ్చు కదా?అని జనాల ధర్మసందేహం.
ఒకవేళ బిజెపి, జనసేనలు ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చి వాటిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి పదవి ఖరారు చేసేసుకొంటే అప్పుడు జనసేన-టిడిపిల మద్య పొత్తులు లేనట్లే కనుక రెండూ కలిసి వచ్చే ఎన్నికలలో టిడిపిని, అధికార వైసీపీని ఎదుర్కొని ఓడించేయగలవా?అంటే దొందుకు దొందూ దొందప్పలే కనుక సాధ్యం కాదని అర్ధం అవుతుంది.
అప్పుడు ఆ రెండూ ములగడమే కాకుండా టిడిపిని కూడా ముంచేసేసినా ఆశ్చర్యం లేదు. వైసీపీ కూడా ఇదే కోరుకొంటోంది కనుకనే వాటి మద్య నిప్పు రాజేసేందుకు ప్రయత్నిస్తోందని గ్రహించి ఎంత త్వరగా ఈ ‘మాయా ముఖ్యమంత్రి’ భ్రమలో నుంచి బయటపడితే అంత మంచిది.
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తున్నారు కనుక ఈ పంచాయతీని ఆయన పరిష్కరించి వెళితే ఇంకా మంచిది. లేకపోతే రెండు పార్టీలు ఇలాగే రాజకీయ కామెడీ షో చేస్తూ జగన్ పాలనలో అలసిపోయున్న జనాలకి వినోదం పంచుతూనే ఉంటాయి.