Target KCR BJPతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆప్తుడు, రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖుడు గా ఉన్న జూపల్లె రామేశ్వరరావు కు చెందిన మైహోం గ్రూప్ సంస్థలపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం సంచలనంగానే ఉంది.మై హోం గ్రూపునకు చెందిన అన్ని కార్యాలయాలు, నివాసాల్లో ఐటి దాడులు జరగటం ఆసక్తికర పరిణామంగా మారింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సోదాలలో ఐటీ అధికారులు కీలకమైన పత్రాలు తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయి.

అలాగే రమేశ్వర్ రావు అతని తమ్ముడు, కొడుకులను ఈ నెల 10న, 11న రెండు రోజులు విచారణకు రమ్మని ఐటీ అధికారులు నోటీస్ లు ఇచ్చినట్లుగా సమాచారం. తెలంగాణ ప్రభుత్వం మైహోం గ్రూప్‌కు ఇచ్చిన భూముల పత్రాలను కూడా ఐటీ అధికారులు తీసుకువెళ్లారు అనే వార్తలు నిజమైతే మోడీ ప్రభుత్వం కేసీఆర్ ను టార్గెట్ చేసిందనే అనుకోవాలి. పైగా రామేశ్వరరావు ఇళ్ళు, ఆఫీసులపై జరిగిన ఈ దాడులలో తెలంగాణకు చెందిన ఒక్క అధికారి కూడా పాల్గనలేదని తెలుస్తుంది.

అసలు ఐటీ డిపార్టుమెంటులో ఉన్న ఏ తెలంగాణకు చెందిన అధికారికి దాడుల విషయం తెలీకుండా జాగ్రత్త పడ్డారట. దీనిబట్టి ఏ రకంగా చూసినా కేసీఆరే టార్గెట్ అని కనిపిస్తుంది. ఇటీవలే జరిగిన ఎన్నికలలో బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చింది అదే సమయంలో ఆ పార్టీ తెలంగాణలో నాలుగు సీట్లు గెల్చుకుంది. దీనితో తెలంగాణాలో 2024 ఎన్నికల సమయానికి అవకాశం కనిపించడంతో బీజేపీ వైఖరిలో స్పష్టమైన మార్పులు వచ్చాయి. గతంలో చంద్రబాబును వేధించినట్టుగానే కేసీఆర్ మీద కూడా అదే మంత్రం ప్రయోగిస్తున్నట్టుగా ఉంది.