వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గత నాలుగేళ్లుగా సీబీఐ అధికారులను ముప్పతిప్పలు పెడుతూనే ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేయడం చాలా అవసరమని హైకోర్టులో చెపుతున్నారు కానీ అరెస్ట్ చేయలేకపోతున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ము సీబీఐకి లేదని, అవినాష్ రెడ్డిని ఏదో అదృశ్య రాజకీయశక్తి కాపాడుతోందంటూ మీడియా, సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. సీబీఐ అధికారులు వాటిని పట్టించుకోవడంలేదు కానీ బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఘాటుగా స్పందించారు.
ఈరోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, “సీబీఐ అత్యంత శక్తివంతమైన దర్యాప్తు సంస్థ. సీబీఐ ఒకసారి అడుగు ముందుకు వేస్తే దానిని ఏ రాజకీయశక్తి ఆపలేదు. రాజకీయ నాయకులు, వారి అనుచరుల బెదిరింపులకు భయపడేది కాదు. కానీ ఏపీలో కొన్ని తోకపార్టీలు సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని చూసి భయపడుతున్నారని, ఆయనను అరెస్ట్ చేయడానికి వెనకడుతున్నారంటూ సీబీఐ అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బ తీసేలా మాట్లాడుతున్నారు,” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీబీఐ ఎవరికైనా నోటీసులు పంపించినా, విచారణకు పిలిచినా, అరెస్ట్ చేసినా వాటితో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదంటూ బిజెపి నేతలు చెపుతుంటారు. కానీ ఇప్పుడు సీబీఐపై కొందరు విమర్శలు చేస్తుంటే బిజెపి నేతలకి రోషం వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సీబీఐని ఎవరూ ఆపలేరన్నప్పుడు వివేకా హత్య కేసుని ఏపీలో విచారించి దోషులను అరెస్ట్ చేయలేకపోయింది కదా? అందుకే సునీతారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ కేసు విచారణకు హైదరాబాద్‌కు బదిలీ చేయించుకోవలసి వచ్చింది కదా? అయినప్పటికీ సీబీఐ అవినాష్ రెడ్డిని విచారణకు కూడా రప్పించలేకపోతుండటం నిజం కాదా?కర్నూలు కళ్లెదుటే అవినాష్ రెడ్డి కనిపిస్తున్నా సీబీఐ అధికారులు ఆయన వద్దకు చేరుకోలేకనే జిల్లా ఎస్పీని సహాయం కోరిన మాట వాస్తవమే కదా?అయినా సీబీఐ విచారణకు బిజెపికి సంబందం లేదు కదా? మరి గుమ్మడి కాయల దొంగ అంటే జీవీఎల్ నరసింహరావు ఎందుకు భుజాలు తడుముకొంటున్నారు?