BJP Government stops funds to Vijayawada Kanaka Durga Flyoverటీడీపీ ఎన్డీయే నుండి బయటకు రావడంతో అప్పుడే వేధింపు చర్యలు మొదలయ్యినట్టుగా కనిపిస్తుంది. అసలే నిధుల సమస్య వల్ల నత్తతో పోటీ పడుతూ.. విజయవాడ నగరవాసులకు ట్రాఫిక్‌ కష్టాలు ఎలా ఉంటాయో చూపిస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ మొదటిదిగా కనిపిస్తుంది. నిధులు మంజూరు చేయాల్సిన కేంద్రం అడ్డంకులు సృష్టించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.

బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం వ్యయంలో 75శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంది. భూసేకరణ పరిహారం, పునరావాసం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. నాలుగు వరసల రహదారి, కనకదుర్గ పైవంతెన కలిపి రూ.448.60 కోట్లకు దక్కించుకుంది.

అంచనా వ్యయం ప్రకారం ఈ ప్రాజెక్టులో కేంద్రం334కోట్లు భరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 114.60 కోట్లు కేటాయించాల్సి ఉంది. కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ.144 కోట్లు బిల్లులు మంజూరు అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్రం తన పరిధికి మించి నిర్మాణం జాప్యం కాకూడదనే ఉద్దేశ్యంతో రూ.170 కోట్లు వెచ్చించింది.

బిల్లులు పంపుతున్న సిబ్బంది, గుత్తేదారుల ప్రతినిధులతో కేంద్ర పీఏఓ కార్యాలయం సిబ్బంది ఎగతాళిగా మాట్లాడుతున్నారట. “ఇక నుంచి మీరు పంపే బిల్లులు అంత సులభంగా ఆమోదించం. అన్నీ సక్రమంగా ఉండి పైనుంచి అనుమతి ఉంటేనే అప్రూవల్‌ చేస్తాం.. సమీకరణాలు మారాయి,” అంటూ వారు ఉన్న మాట డైరెక్టుగానే చెప్పేస్తున్నారంట.