narendra-modi-sonia-pawwan-kalyan‘జనసేన’ అధినేత పవన్ చెప్పినట్లుగా కాంగ్రెస్ అవకాశవాద రాజకీయమే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందనేది స్పష్టం. అవును… నాడు జగన్ అండతో ఏపీలో, కేసీఆర్ అండతో తెలంగాణాలో పాతుకుపోవాలనే కుటిల రాజకీయ బుద్ధితో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన ఘనతను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దక్కించుకున్నారు. ఇది ఖచ్చితంగా అవకాశవాద రాజకీయమే. మరి విభజన తర్వాత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ ఏం చేసారు? అవకాశవాద రాజకీయాలకు విరుద్ధంగా ఏమైనా చేసారా? అంటే నోరెళ్ళబెట్టాల్సిందే.

కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ సర్కార్ ఫుల్ మెజారిటీతో కాకుండా టిడిపి వంటి ఇతర పార్టీల సహాయ సహకారాలతో ప్రభుత్వం ఏర్పడితే… ఏపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే… అవును… ఖచ్చితంగా ఏపీకి ఈ దుస్థితి అయితే వచ్చి ఉండేది కాదు. రాష్ట్రానికి ఆర్ధిక సాయం నుండి ప్రత్యేక హోదా వరకు అన్నీ ఏపీ కాళ్ళ దగ్గరికి వచ్చేవని చెప్పడంలో మరో సందేహం లేదు. ఇది సామాన్య ప్రజలు భావిస్తున్న విషయమే కాదు, రాజకీయ విశ్లేషకులు, నిపుణులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.

అంటే రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి, రాజకీయ ప్రయోజనాలకే మోడీ సర్కార్ కూడా మొగ్గు చూపుతోందన్నది స్పష్టం. మరో రకంగా చెప్పాలంటే… పవన్ చెప్తున్నట్లు… కాంగ్రెస్ పార్టీ వెన్నులో పొడిచిందని, బిజెపి దగ్గరికి వెళితే ఏకంగా పొట్టలో పొడిచి చంపేసే ప్రయత్నం చేస్తోందన్నది స్పష్టం. అవకాశవాద రాజకీయాల ప్రభావమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తమకు పూర్తి మెజారిటీ ఉంటే ఒకలా, లేకపోతే మరోలా ప్రవర్తించడం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు పరిపాటిగా మారిపోయింది.

మరో విశేషమేమిటంటే… నాడు ప్రతిపక్షంలో ఉన్నపుడు బిజెపి ఎన్ని నీతి కబుర్లు చెప్పిందో, ప్రస్తుతం వాటిని వల్లెవేయడం కాంగ్రెస్ పార్టీ వంతు వచ్చింది. అలాగే నాడు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ మాదిరి ప్రవర్తించడం నేడు బిజెపి వంతోచ్చింది. మొత్తంగా కాంగ్రెస్, బిజెపిలు కలిసి ఏపీని పాతాళంలోకి నెట్టేసే ప్రయత్నాలు అయితే జోరుగా చేసాయి, చేస్తున్నాయని కూడా చెప్పవచ్చు. నాడు సోనియాగాంధీ చేసిన స్వార్ధ రాజకీయానికి రాక్షసత్వం జోడించే క్రమంలో ప్రస్తుత పాలకులు ఉన్నారనేది ఏపీ ప్రజల ఆవేదనల నుండి వస్తున్న మాటలు.