KCR-Jaganఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినా వాటి మద్య రాజకీయాలు మాత్రం ఇంకా విడిపోలేదనే చెప్పాలి. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నిన్న కరీంనగర్‌లో పాదయాత్ర ముగింపు సభలో చెప్పిన మాటలే ఇందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ మళ్ళీ చేతులు కలిపారు. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి వచ్చే ఎన్నికలలో లబ్ది పొందేందుకు కేసీఆర్‌ ఏపీ సిఎం జగన్‌తో కలిసి కుట్రలు చేస్తున్నారు. అయితే ప్రతీసారి సెంటిమెంట్‌ రాజేసి ఎన్నికలలో గెలవలేమని కేసీఆర్‌ గ్రహిస్తే మంచిది,” అంటూ కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

రెండుమూడు నెలల క్రితం కేసీఆర్‌ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ని పిలిపించుకొని సుదీర్గంగా మంతనాలు చేసినప్పుడు ఏపీలో బిఆర్ఎస్‌ విస్తరణ గురించి చర్చించారని అందరూ భావించారు. కానీ ఉండవల్లి కొంత గ్యాప్ ఇచ్చి సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజన కేసు గురించి మాట్లాడారు. దానిపై సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే స్పందిస్తూ, మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే వైసీపీ ప్రభుత్వం స్వాగతిస్తుందని అన్నారు. ఊహించినట్లుగానే తెలంగాణ మంత్రులు ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈ వాదోపవాదాలతో తెలంగాణ సెంటిమెంట్ రగులుతుందని వేరే చెప్పక్కర లేదు. అందుకే కేసీఆర్‌, జగన్ ఇద్దరు సెంటిమెంట్ రాజేసేందుకు చేతులు కలిపారని బండి సంజయ్‌ ఆరోపిస్తున్నారు.

తెలంగాణ సెంటిమెంట్ రాజేసి కేసీఆర్‌కి లాభం చేకూర్చుతున్నప్పుడు, అందుకు ప్రతిగా కేసీఆర్‌ కూడా జగన్‌కి, వైసీపీ పార్టీకి మేలు చేయాల్సి ఉంటుంది. కనుకనే ఏపీలో బిఆర్ఎస్‌ పార్టీని విస్తరిస్తామని, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కి ఈ బాధ్యతలు అప్పగించారని, ఆయన ఏపీలో కులాల వారీగా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ మీడియాకి లీకులు ఇస్తున్నారు. మళ్ళీ వాటిపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తున్నారు.

ఇప్పటికే మూడు రాజధానులతో ప్రాంతీయ సెంటిమెంట్ రగిలించి లబ్ది పొందాలని చూస్తున్న వైసీపీ నేతలు, రాబోయే రోజులలో ఏపీలో బిఆర్ఎస్‌ హడావుడి చేస్తే ఆంద్రా సెంటిమెంట్ కూడా రగిలించేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పవచ్చు. ప్రజల భావోద్వేగాలతో రాజకీయాలు చేసి లబ్ది పొందాలనుకొనేవారికి ఎన్నికలలో తగిన విదంగా బుద్ధి చెపితే మళ్ళీ ఎన్నడూ ఇటువంటి వికృత ఆలోచనలు చేయరు.