Amit -Shah - Narendra Modiవచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అన్నది స్పష్టమైన విషయం. తెలుగుదేశం ఒక్కటే ఒక వైపు, వైసీపీ + జనసేన + సీపీఐ + సీపీఎం + బిజెపిలు మరొక వైపు అన్న విషయం చంటి పిల్లాడు కూడా చెప్పగలడు. టార్గెట్ టిడిపిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి స్కెచ్ లను సిద్ధం చేస్తోంది, చేసింది అన్న విషయం పొలిటికల్ వర్గాలతో పాటు చాలామంది ప్రజలకు కూడా ఇప్పటికే అర్ధమైంది. ఎవరెన్ని విమర్శలు చేసినా తదుపరి ఎన్నికలలో చంద్రబాబుకు అధికారం దూరం చేయడమే ముఖ్యం అన్న లక్ష్యంతో ఈ పొలిటికల్ పార్టీలన్నీ అడుగులు వేస్తున్నాయి.

ఫైనల్ గా… ఎవరికీ పట్టం కడతారు? ఎవరిని అందలం ఎక్కిస్తారు? అని ప్రజలే నిర్ణయించుకుంటారు, దానికి మరో ఏడాది వరకు సమయం ఉంది కాబట్టి ఇప్పుడు విశ్లేషించాల్సిన అవసరం లేదు. అయితే చంద్రబాబును అష్టదిగ్భంధనం చేసే విధంగా మోడీ సర్కార్ పావులు కదుపుతొందన్నది చంద్రబాబు గ్రహించాల్సిన విషయం. గత నాలుగేళ్ళుగా జగన్ తో ముప్పేట దాడి చేయిస్తున్నా, అది ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మరొక ఆప్షన్ గా పవన్ కళ్యాణ్ ను బరిలోకి దింపిందన్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ‘జనసేన’ అధినేత విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

తనను చంద్రబాబు ఏకంగా చంపించేయడానికే ప్లాన్ వేసారంటూ మరీ చవకబారు ఆరోపణలు కూడా పవన్ కళ్యాణ్ చేయడం వెనుక ఉన్న అదృశ్య శక్తులు తెలియనివి కావు. అయితే ఇలా బయటనుండే కాకుండా తెలుగుదేశం పార్టీలో నుండి కూడా అసంతృప్తవాదులను రెచ్చగొట్టి, టిడిపికి వ్యతిరేక పవనాలు వీసేలా చేయాలన్నది బిజెపి మరో స్కెచ్ గా పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయాలలో జంపింగ్ లు సాధారణమే. అయితే ఆ జంపింగ్ చేసే తీరులోనే కాస్త తేడాలుంటాయి. వైసీపీ నుండి టిడిపికి వచ్చేటపుడు అభివృద్దే ముఖ్యమంటూ పార్టీ మారుతూ వచ్చారు. అలాగే టిడిపి నుండి టీఆర్ఎస్ కు వెళ్ళిన సందర్భంలో కూడా ఇవే వ్యాఖ్యలు వినిపించాయి.

కానీ నేడు మోత్కుపల్లి జంప్ అయిన విధానంలో ఖచ్చితంగా ఒక స్కెచ్ మరియు కక్ష్యపూరితమైన ప్లానింగ్ కనపడుతోంది. ఇన్నాళ్ళు చంద్రబాబును ప్రశంసించిన మోత్కుపల్లి, నేడు ఎన్టీఆర్ కోసం కంటతడి పెట్టడం… బహుశా నటనలో పవన్ వద్ద శిక్షణ తీసుకున్నారో ఏమో గానీ, ఎక్కడలేని ప్రేమను కురిపించారు. ఇలా పార్టీలో అంతర్గతంగా కూడా వివాదాలు రేపి… ఓ వైపు ప్రతిపక్షాలతో, మరో వైపు స్వపక్షాలతో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తూ… అష్టదిగ్భంధనం చేయడానికి బిజెపి పక్కా ప్లానింగ్ తో వ్యవహరిస్తోందన్నది లేటెస్ట్ న్యూస్. మరి అపర చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు దీని నుండి ఎలా బయటపడతారో కాలమే సమాధానం చెప్పాలి.