BJP-Andhra-Pradesh Somu-Veerrajuఆంధ్రప్రదేశ్‌లో బిజెపి ఉంది కానీ ప్రజాధారణ పొందలేకపోయింది. అందుకు గట్టి ప్రయత్నాలు కూడా చేసినట్లు కనబడదు. తెలంగాణ రాష్ట్రంలోలాగ ఏపీలో సమర్దమైన నాయకత్వం లేకపోవడం, ఉన్నవారిలో పోరాట స్పూర్తి లేకపోవడం, నేతలలో చురుకుదనం లోపించడం వంటివి పార్టీ పరంగాకనిపిస్తున్న లోపాలు.

వైసీపీ పాలనలో జరుగుతున్న లోపాలు, అనాలోచిత నిర్ణయాలు, అప్పులు, అరాచకాలు, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై సైతం నిర్లిప్తతో వ్యవహరిస్తుండటం విధానపరమైన లోపాలుగా చెప్పుకోవచ్చు.

ఇవే అంశాలపై టిడిపి అలుపెరుగని పోరాటాలు చేస్తూ నిత్యం ప్రజల మద్య ఉంటుంటే, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తప్ప మిగిలినవారు ఎవరో… ఎక్కడున్నారో ప్రజలకు కూడా తెలీదంటే బిజెపి పరిస్థితి ఏవిదంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. కనుక ఈ మూడున్నరేళ్ళలో రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన అవకాశాలను వదిలేసుకొందని చెప్పవచ్చు.

మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక బిజెపి ఏపీలో తన ఉనికిని చాటుకొనేందుకు సిద్దమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ప్రజా పోరాట సభలు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. వీటి ద్వారా జగన్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనపై గట్టిగా నిలదీస్తామని చెప్పారు.

గతంలో తెలంగాణ సిఎం కేసీఆర్‌, మోడీ, అమిత్‌ షాలతో రాసుకుపూసుకు తిరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రజలు బిజెపి విమర్శలను విశ్వసించేవారు కారు. కానీ కేసీఆర్‌ ప్రభుత్వం పట్ల బిజెపి స్పష్టమైన వైఖరితో వ్యవహరించడం మొదలుపెట్టినప్పటి నుంచే టిఆర్ఎస్‌, కేసీఆర్‌ను వ్యతిరేకించేవారు క్రమంగా బిజెపివైపు మొగ్గు చూపుతున్నారు.

ఏపీలో కూడా ఇంచుమించి అవే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిలు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలతో రాసుకుపూసుకు తిరిగేటంత సాన్నిహిత్యం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అర్దమయ్యేలా తెలియజేస్తుంటే, బిజెపి ఎన్ని సభలు నిర్వహించి ఏం ప్రయోజనం?వైసీపీ ప్రభుత్వాన్ని ఎంత విమర్శించి ఏం ప్రయోజనం?కనుక వైసీపీ ప్రభుత్వం పట్ల బిజెపి వైఖరిలో మార్పు వచ్చినప్పుడే దానిని ప్రజలు విశ్వసిస్తారు. అంతవరకు ఈ సభలు, విమర్శలు కాలక్షేపానికి మాత్రమే పనికివస్తాయి.