Jagan_modiఆంధ్రప్రదేశ్‌ ప్రజల దురదృష్టం ఏమిటో గానీ వారు ఏ జాతీయపార్టీని నెత్తినపెట్టుకొని ఆదరించినా అది వారినే తొక్కేస్తుంటుంది. ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రజలు తిరుగులేని మెజార్టీతో గెలిపించేవారు. కానీ అక్కడ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, ఇక్కడ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కూడా ఆంద్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరించేవి. కాంగ్రెస్‌ నిర్లక్ష్యానికి రాష్ట్ర విభజన పరాకాష్టగా చెప్పుకోవచ్చు.

అందుకు ఆగ్రహించిన ఆంద్ర ప్రజలు మూడో కన్ను తెరిచి ఏపీలో కాంగ్రెస్ పార్టీని భస్మం చేసేశారు. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం దీనిని గుణపాఠంగా స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తే, అదీ కాంగ్రెస్ పార్టీలాగే వ్యవహరిస్తుండటం విస్మయం కలిగిస్తుంది.

సాక్షాత్ ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన అమరావతిని, వైసీపీ ప్రభుత్వం రాజధానిగా అంగీకరించకుండా కొత్తగా మూడు రాజధానులు పాట పాడుతుంటే ప్రధాని నరేంద్రమోడీ వద్దని వారించలేదు. అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా చెప్పలేదు.

వైసీపీ ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు పంచిపెడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారించలేదు. పైగా ఎప్పటికప్పుడు కొత్త అప్పులు ఇప్పిస్తూ ఏపీ మరింత మునిగిపోయేందుకు వైసీపీకి తోడ్పడుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా దశాబ్ధాలుగా విజయవంతంగా నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ని కేంద్ర ప్రభుత్వం అమ్మిపడేస్తుంటే రన్నింగ్‌లో ఉన్న ఆ ప్లాంట్‌ని వైసీపీ ప్రభుత్వం కాపాడుకొనే ప్రయత్నం చేయకుండా కడపలో కొత్తగా స్టీల్ ప్లాంట్‌ కడతామంటూ శంకుస్థాపనలతో ప్రజలను మభ్యపెడుతోంది.

ఈవిదంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి అమరావతిని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నిలువునా ముంచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

2014 ఎన్నికల సమయంలో ఢిల్లీని తలదన్నెలా అమరావతిని నిర్మిస్తామని తిరుపతిలో ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్ర ప్రభుత్వానికి, దానిని నడిపిస్తున్న బిజెపికి ఆసక్తి లేకపోవచ్చు. కానీ వైసీపీ కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఎందుకు దెబ్బ తీస్తోందని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణ పనులు కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. మూడు రాజధానులు అంటూ ఆంధ్రప్రదేశ్‌ని మళ్ళీ ఎందుకు ఛిన్నాభిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ, బిజెపిలు రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నిలువునా ముంచేశాయని వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రజలంటే అందరికీ ఇంత అలుసు దేనికో?