venkaiah-naidu-arun-jaitley-special-statusప్రత్యేక హోదా… ప్రత్యేక ప్యాకేజ్… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న రెండు మాటలు. ఢిల్లీ గద్దె మీద ఉన్న వారి నుండి ఏపీ అట్టడుగున ఉన్న వారి వరకు ఈ రెండింటి మీద తీవ్రంగా చర్చలు జరిగాయి… జరుగుతున్నాయి… జరుగుతూనే ఉంటాయి కూడా..! ఒక్కసారి కేంద్రం మాటను పరిశీలిస్తే… ప్రత్యేక హోదాను మించిన ప్యాకేజ్ ను అందించాం, ఇంకా హోదాతో మీకు సంబంధం లేదు… అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అయినా ‘స్పెషల్ స్టేటస్’ అంశం 2017 నుండి దేశవ్యాప్తంగా పూర్తిగా రద్దు కానుంది, ఈ సమయంలో రాష్ట్రానికి హోదా ఇచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదు అంటూ కొత్త పల్లవిని కూడా ఆలపిస్తున్నారు.

అవును… బిజెపి వాళ్ళు చెప్తున్న మాటలో నిజమే ఉందనుకుందాం. అదే నిజమైతే ఏపీ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు అడుగుతున్నట్లు ఈ ఒక్క సంవత్సరానికైనా ప్రత్యేక హోదా ఇచ్చి చేతులు దులుపుకోవచ్చు కదా! అప్పుడు కేంద్రం తన బాధ్యతలను నెరవేర్చినట్లవుతుంది, అలాగే కేంద్రాన్ని నిందించే అవకాశాన్ని ఏపీ ప్రజలు కోల్పోతారు. రాష్ట్ర అభివృద్ధితో బిజెపి ప్రభుత్వానికి సంబంధాలు తెగిపోతాయి. ఒక రకంగా బిజెపికి చాలా సేఫ్ పొజిషన్ లో ఉంటుంది. కానీ, అలా చేయలేదు అంటే… ప్రత్యేక హోదాకు, ప్యాకేజ్ కు అస్సలు సంబంధం లేదని స్పష్టంగా అర్ధమవుతోంది. అలాగే కేంద్రమంత్రివర్యులు సుజనా చౌదరి లాంటి వాళ్ళు చెప్తున్న ‘హోదాతో లాభం కంటే నష్టమే ఎక్కువన్న’ నీతిసూత్రంలో లాజిక్ లేదని తేలిపోయింది.

ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా గమనించాల్సింది ఏమంటే… దేశంలో ప్రస్తుతం ప్రత్యేక హోదా అనుభవిస్తున్న ఇతర రాష్ట్రాలు ఏమంత అభివృద్ధి చెందాయి? అని ప్రశ్నిస్తున్నారు. అవును నిజమే… బాబు గారు చెప్తున్నది నిజమే. కానీ, ఏపీలో ఉన్న పరిస్థితులు మిగిలిన రాష్ట్రాల్లో లేవన్న సంగతి మన ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఒక రకంగా ఆయా రాష్ట్రాలు ప్రత్యేక హోదాను వినియోగించుకోలేకపోవడానికి కారణం… అది ప్రత్యేక హోదా తప్పు కాదు. అక్కడున్న పరిస్థితుల ప్రభావం. ఏపీలో సహజ సిద్ధ ప్రకృతి వనరులు, మానవ వనరులకు కొదవలేదు. ఇవే పెట్టుబడులకు ప్రధమ మెట్టు. అయితే దీనికి ‘స్పెషల్ స్టేటస్’ కూడా తోడయితే, అప్పుడు అభివృద్ధి ఎక్స్ ప్రెస్ వేగంతో పరుగులు పెట్టే అవకాశం ఉంది.

ముఖ్యంగా ప్రత్యేక హోదా వలన… అభివృద్ధి వికేంద్రీకరణ, అవినీతికి ఆస్కారం తక్కువ, పారిశ్రామిక అభివృద్ధి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్యాకేజ్ అయితే అవినీతికి అవకాశం, అభివృద్ధి కేంద్రీకరణ తధ్యం. అయితే ప్రస్తుతం ‘బాల్’ అనేది కేంద్రం కోర్టులో ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితులలో చిక్కుకుని ఉంది. ఇదే అదునుగా కేంద్రం ఏపీతో ఓ ఆట ఆడుకుంటోంది..!