kcr-movieతెలంగాణా ఆవిర్భావం వెనుక కాంగ్రెస్ కుటిల రాజకీయ కుట్ర ఎంత ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ను ఆ విధంగా డిఫెన్స్ లో పడేయడంలో గానీ, కాంగ్రెస్ ను ఆ విధంగా ప్రలోభ పెట్టడంలో గానీ కేసీఆర్ పాత్ర తీసివేయలేనిది. రాజకీయంగా సాగిన ఉద్యమంలో విద్యార్ధులతో సహా అన్ని వర్గాలను భాగస్వామ్యులను చేసిన ఘనత కేసీఆర్ సొంతం. ఒక విధంగా “తెలంగాణా జాతిపిత”గా టీఆర్ఎస్ వర్గాలు, కేసీఆర్ అభిమానులు అభివర్ణిస్తుంటారు. అలాంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ జీవితం వెండితెర రూపం దాల్చుకోబోతోంది.

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన 2017, జూన్ 2వ తేదీ నాడు ఈ సినిమా ప్రారంభోత్సవానికి నోచుకోబోతోంది. మధుర శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ ఫేం రాజ్ కందుకూరి నిర్మిస్తున్నారు. ఈ లోపున చిత్ర తారాగణం, ప్రీ ప్రొడక్షన్ వర్క్ తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ సినిమాను కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 2018 ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాపై ప్రముఖ రచయితే సిరాశ్రీ ఓ ఆసక్తికరమైన కామెంట్ చేసారు.

“కేసీఆర్ జీవితగాధను వెండితెర రూపం దాల్చాలనుకోవడం సరైన నిర్ణయమని, 4 కోట్ల మంది తెలంగాణా ప్రజలు ఈ సినిమాను ఒక్కసారి చూసినా 400 కోట్ల కలెక్షన్స్ వస్తాయని” ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు. తెలంగాణా జాతిపిత కొనియాడుతున్న కేసీఆర్ జీవితంలో జరిగిన అనేక సంఘటనలు తెలుసుకోవాలన్న ఉత్సాహం సాధారణమే కావడంతో, తెలంగాణాలోని ప్రతి ఒక్కరు ఈ సినిమాను వీక్షిస్తారనేది సిరాశ్రీ లాజిక్. మరి సదరు రచయిత లెక్కలు వర్కౌట్ అయితే, ఆల్ టైం రికార్డులను సృష్టించడం ఖాయం కదా మరి!