Bigg Boss Telugu Season 3కింగ్ నాగార్జున హోస్టుగా చేస్తున్న బిగ్‌ బాస్‌-3 షో ఈ నెల 21న ప్రారంభం కాబోతుంది. అయితే షో ప్రారంభం తేదీ దగ్గర పడే కొద్దీ వివాదాలు చుట్టుముడుతున్నాయ. ఇప్పటికే ఒక టీవీ యాంకర్, గాయని షో నిర్వాహకులపై కేసులు పెట్టారు. దీనితో విపరీతమైన బాడ్ పబ్లిసిటీ వచ్చింది. ఈ కేసులపై బిగ్ బాస్ నిర్వాహకులు హై కోర్టును ఆశ్రయించారు. అవి దురుదేశపూర్వకంగా పెట్టిన కేసులని, వాటిని కొట్టివేయాలని నిర్వాహకులు హైకోర్టుకు విన్నవించుకున్నారు.

విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. బిగ్ బాస్ నిర్వాహకులకు ప్రస్తుతానికి ఊరటనిచ్చింది. వారిని తాము చెప్పే వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నిర్వాహకులుపై నమోదైన కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను, పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ వరకు బిగ్‌బాస్‌ నిర్వాహకులను అరెస్ట్‌ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీనితో వారు ఊపిరిపీల్చుకున్నారు.

మ‌రోవైపు, బిగ్ బాస్ 3 ప్రసారాన్ని నిలిపివెయ్యాలని తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖ‌లు చేశాడు నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ఈ క్రమంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు 100 రోజుల పాటు జరగబోయే ఈ షో లో 15 మంది పోటీదారులు ఉంటారట. ఈ షో పై ఇప్పట్నుంచే భారీ అంచనాలున్నాయి. గత రెండు సీజన్లలో బిగ్ బాస్ షో పై ఇటువంటి వివాదాలు రాకపోవడం గమనించదగిన విషయం. మొదటి రెండు సీజన్‌లకు ఎన్టీఆర్, నాని హోస్టులు కాగా మూడోసారి నాగార్జున రంగంలోకి దిగుతున్నాడు.