Bigg Boss Telugu Contestant List‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహించబోతున్న తొలి షో “బిగ్ బాస్”పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు నుండి ప్రారంభం కాబోతున్న ఈ షోలో ఏ ఏ సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు? అనే విషయాన్ని షో నిర్వాహకులు సీక్రెట్ గా ఉంచిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో మీడియా నుండి ఈ ప్రశ్న ఎదురుకాగా, ఎన్టీఆర్ అయితే తనకు తెలియదని, షో నిర్వాహకులు మాత్రం మొదటి షో వరకు వేచిచూడమని చెప్పారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ జాబితా చక్కర్లు కొడుతోంది. మొత్తం 14 మంది జాబితాతో కూడిన ఈ సెలబ్రిటీలలో శివబాలాజీ, ముమైత్ ఖాన్, తేజస్వి మదివాడ, ధన రాజ్, ఆదర్శ్, సంపూర్ణేష్ బాబు, అర్చన, మధుప్రియ, కల్పన, మహేష్ కత్తి, జ్యోతి, సమీర్, హరితేజ, కత్తి కార్తీక ఉన్నారు. ఇందులో ఆరుగురు సెలబ్రిటీలు పురుషులు కాగా, ఎనిమిది మంది మహిళా ముద్దుగుమ్మలు ఉన్నారు. అయితే షో పబ్లిసిటీలో 12 మంది మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఉంటారని స్పష్టం చేసారు.

దీంతో ఈ 14 మంది జాబితాలో ఓ ఇద్దరు ముద్దుగుమ్మలు యాంకర్లుగా ఎన్టీఆర్ కు సహాయ సహకారాలు అందిస్తారని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 12 మంది, ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉండనున్నారు. తొలి ఎపిసోడ్ లో ఈ మొత్తం సెలబ్రిటీల పరిచయ కార్యక్రమాలు, అలాగే బిగ్ బాస్ షో కాన్సెప్ట్ ను, నియమ నిబంధనలను వివరించడం ఉంటుంది. అసలు షో సోమవారం నుండి ప్రారంభం కానున్నప్పటికీ, మొదటి ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్ తన డ్యాన్స్ లతో మెస్మరైజ్ చేయనున్నారు.