శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ సెలెబ్రిటీ నూతన్‌ కుమార్‌ నాయుడును పోలీసులు అరెస్టు చేసారు. కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని పోలీసులు కర్ణాటకలోని ఉడిపిలో అదుపులోకి తీసుకున్నారు. ఉడిపి నుండి ముంబైకి పారిపోయేందుకు నూతన్‌ నాయుడు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడని పోలీసులు అంటున్నారు.

కాగా శిరోముండనం చేస్తున్న సమయంలో స్పాట్ లో నూతన్ నాయుడు లేరు. అతని భార్య మాత్రమే ఉన్నారు. ఆమెను ఏ1గా చేర్చారు పోలీసులు. అయితే ఈ కేసులో నూతన్ నాయుడు పాత్ర కూడా ఉందని పోలీసుల విచారణలో తేలిందని అందుకే అరెస్టు చేసాం అని పోలీసులు మీడియాకు తెలిపారు.

ఇది ఇలా ఉండగా… నూతన్ నాయుడు ఏ పార్టీ మద్దతుదారుడు అనేదాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాను పవన్ కళ్యాణ్ కి చాలా దగ్గర అని చాలా సార్లు అతను చెప్పడం… పవన్ మీద రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాకు వ్యతిరేకంగా పరాన్నజీవి అనే సినిమా తీయడంతో అతను జనసేన మద్దతుదారుడని సాక్షి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.

ఆ తరువాత మరో ఇంటర్వ్యూలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావం సమయంలో తాను ఆ పార్టీ జండా, ఎజెండా రూపకల్పన చేశాను అని, జగన్ జైలుకు వెళ్ళినప్పుడు పార్టీ కోసం షర్మిల భర్త అనిల్ తో కలిసి పని చేశా అని చెప్పడంతో సాక్షి, వైఎస్సార్ కాంగ్రెస్ వెనక్కు తగ్గింది. ఆ మారక చెరుపుకోవడానికి ఇప్పుడు అతనిని జైలుకు పంపినట్టుగా ఉందని పలువురు అంటున్నారు.