Bigboss Telugu Jr NTR Leak Piracyయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న “జై లవకుశ” టీజర్ అధికారికంగా విడుదల చేయడానికి ముందే, సోషల్ మీడియాలో లీకై చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రేక్షకులలో క్రేజ్ సృష్టించే అగ్ర హీరోల సినిమాలకు సంబంధించి ఇలాంటి లీకులు సర్వసాధారణం గనుక, ఈ లీకులు ఒరిజినల్ టీజర్ ను ఏ మాత్రం ప్రభావితం చూపలేకపోయాయి. తారక్ నటించిన ‘జైలవకుశ’ టీజర్ లీకుల మాదిరే, తారక్ హోస్ట్ చేస్తోన్న ‘బిగ్ బాస్’ కార్యక్రమానికి సంబంధించి కూడా లీకుల పర్వం మొదలైంది.

ఈ వారం రెండు ఎలిమినేషన్స్ ఉన్న దరిమిలా… మొదటి పార్టిసిపెంట్ గా మహేష్ కత్తి ఇప్పటికే బయటకు వచ్చేయగా, రెండవ ఎలిమినేషన్ ను సస్పెన్స్ లో ఉంచుతూ, ఆదివారం చూపిస్తానని తారక్ షోని ముగించారు. కల్పన, హరితేజ, దీక్షాపంత్… ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని ప్రేక్షకులకు జూనియర్ చెప్పేయగా, తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయిన సమాచారం ప్రకారం హరితేజ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. ‘బిగ్ బాస్’ నిబంధనల ప్రకారం ముందస్తుగా ఎలాంటి సమాచారం లీక్ కాకుండా చూసుకోవాలి.

కానీ హరితేజ విషయంలో మాత్రం లీక్ కావడం విశేషం. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వారందరి వివరాలు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించిన తర్వాతే ప్రేక్షకులకు తెలియగా, ‘మంగమ్మ’ పాత్రలో సిల్వర్ స్క్రీన్ పైన మెరిసిన హరితేజ సమాచారం ముందుగా లీక్ అయ్యింది. అయితే దీని ప్రభావం షోపై పెద్దగా పడే అవకాశాలు లేవు గానీ, ఈ లీకులు మున్ముందు దేనికి దారి తీస్తాయో మాత్రం షో నిర్వాహకులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వైల్డ్ కార్డు ఎంట్రీ పేర్లు షో నిర్వాహకులు ప్రకటించకుండానే సోషల్ మీడియాకు ఎక్కేస్తున్నాయి.