big blow to movies Releasing in diwali this weekదీపావళి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. వాటిలో విశ్వక్ సేన్ ‘ఓరిదేవుడా’, కార్తీ ‘సర్దార్’, విష్ణు ‘జిన్నా’, శివకార్తికేయన్ ‘ప్రిన్స్’, హాలీవుడ్ డబ్బింగ్ సినిమా ‘బ్లాక్ ఆడమ్’ సినిమాలు ట్రైలర్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మరో మూడు రోజుల్లో పండుగ సినిమాలు విడుదలకు సిద్దమవుతుండగా, ప్రచారాలు జోరుగా మొదలెట్టినా ఈ సినిమాల వైపు ప్రేక్షకులు దృష్టి సారించటంలేదు. దీనికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీటింగ్ కోసం విశాఖపట్నం వెళ్లిన దగ్గర నుండి, అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజల్ని జనసేనాని వైపు తిప్పేశాయి. కరెంటు కోత, పవన్ జగన్ పార్టీ మనుషులను చెప్పుతో కొడతాననడం వంటివి ప్రెస్, మీడియా లతో పాటు ప్రజల్ని కూడా పవన్ వైపు తిరిగేలా చేశాయి.

ఇంత రసవత్తరంగా పవర్ స్టార్ రాజకీయ సినిమా నడుస్తుంటే..చిన్న చిన్న సినిమాలవైపు ఎవరు దృష్టి పెడతారు. కనీసం ఈ రెండురోజులైనా పవన్ ప్రచారాలు, పర్యటనలు ఆపేస్తే, దీపావళికి విడుదలవుతున్న సినిమాలకు కొంత ప్రచారం లభిస్తుంది. నిర్మాతలకి ఊరటలభిస్తుంది. ఇంకా ఎన్నికలకి సంవత్సరం పైగా సమయం ఉందిగా. ఈ దీపావళికి విడుదలవుతున్న మీడియం బడ్జెట్ సినిమాలు కనీస ఓపెనింగ్స్ దక్కించుకుంటాయో లేదో వేచి చూడాలి.