india-wonటైల్ ఎండ్ బ్యాటింగ్ ప్రతిభతో టీమిండియా 316 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ ను అందుకోగలిగింది. తొలి టెస్ట్ మాదిరే, ఈ టెస్ట్ మ్యాచ్ లోనూ చివరి వరుస బ్యాట్స్ మెన్లు సహకారం టీమిండియాకు బాగా తోడ్పడింది. చివరి మూడు వికెట్లు కలిపి దాదాపు 85 పరుగులు జోడించడం విశేషం. తొలి టెస్ట్ లో జడేజా ఆడిన ఇన్నింగ్స్ ను ఈ టెస్ట్ లో వృద్ధిమాన్ సాహా ప్రదర్శించి, 54 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇక, తన ఇన్నింగ్స్ ను ఆరంభించిన కివీస్ జట్టు ఆది నుండి తడబడింది. తొలి వికెట్ ను 10 పరుగుల వద్ద లథంను కోల్పోయిన కివీస్ జట్టు, రెండవ రోజు ముగిసే సమయానికి ఏకంగా 7 వికెట్లు కోల్పోయి కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును టేలర్, రాంకీ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగవ వికెట్ కు 62 పరుగులు జోడించిన తర్వాత రాంకీని జడేజా వెనక్కి పంపడంతో వికెట్ల పతనం ప్రారంభమైంది.

ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ బౌలింగ్ తో కివీస్ బ్యాట్స్ మెన్లను వరుసగా పెవిలియన్ కు పంపాడు. బంతి బంతికి వికెట్ పడుతుందా… అన్నట్లుగా సాగిన మ్యాచ్ లో భువి స్వింగ్ కు క్రీడా పండితులు కూడా ముగ్ధులయ్యారు. ఈ క్రమంలో తన ఖాతాలో మరో 5 వికెట్లను వేసుకున్నాడు భువి. కివీస్ కోల్పోయిన 7 వికెట్లలో షమి, జడేజా చెరొక వికెట్ తీసుకోగా, భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు సొంతం చేసుకున్నాడు. తొలి టెస్ట్ హీరో అశ్విన్ కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసాడు.