Bhuma Nagi Reddy comments on ys jagan jala deekshaవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేత భూమా నాగిరెడ్డి విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో వైఎస్సార్సీపీ నేతలు కాంట్రాక్టులు తీసుకున్నారని, ఆ సొమ్ము ముట్టిన తర్వాత ఏపీలో జగన్ జల దీక్షలకు దిగి కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా జగన్ జలదీక్ష చేస్తుండటంపై కర్నూల్ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని, వైకాపాకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని భూమా ప్రశ్నించారు.

జల దీక్ష విషయమై కర్నూలులోని వైఎస్సార్సీపీ నాయకులను కూడా జగన్ సంప్రదించలేదని, రాజకీయంగా లబ్ది పొందేందుకే ఈ దీక్ష చేస్తున్నారనడానికి ఇంత కన్నా నిదర్శనం ఇంకేమీ కావాలని జగన్ తీరును ఏకరువు పెట్టారు. ఏపీకీ ప్రత్యేక హోదా విషయమై కేంద్ర ప్రభుత్వంతో గొడవపడాలని జగన్ చెబుతుండటం విడ్డూరంగా ఉందని, కేంద్రంతో గొడవపడితే వచ్చే ప్రయోజనాలేంటో జగన్ చెప్పాలని డిమాండ్ చేసారు.

టిడిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని జగన్ కు భూమారెడ్డి సూచనలు చేసారు. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన తర్వాత ఈ రేంజ్ లో జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం భూమా నాగిరెడ్డికిదే తొలిసారి. జగన్ తో కలిసి రాజకీయ ప్రయాణం చేసిన అనుభవం ఉండడంతో… దాదాపుగా వైసీపీ రాజకీయ పరిస్థితులన్నీ భూమాకు తెలిసిన విషయమే. దీంతో జగన్ వ్యవహారంపై భూమా ఎన్ని విమర్శలు చేసినా… వైసీపీ వర్గాలు తిప్పికొట్టకపోవడం గమనించదగ్గ పరిణామం.