Bhuma Akhila Priya Reddy Joininig Janasenaదివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీని వీడనున్నారా? అంటే అవును అనే అంటున్నాయి పార్టీ వర్గాలు. సాక్షాత్తు సీఎం ముఖ్యమంత్రి కర్నూల్ వచ్చి సభ పెడితే ఆ సభకు కూడా రాలేదు అఖిలప్రియ. అయితే ప్రభుత్వ పెద్దలు పార్టీ వర్గాలు కూడా ఆమెతో మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యకపోవడం గమనార్హం. సంక్రాంతి తరువాత ఏపీ క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశానికి గనుక ఆమె హాజరు కాకపోతే పార్టీని వీడినట్టుగానే భావించాలి.

2014 ఎన్నికల సమయంలో శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించడంతో అనివార్య పరిస్థితులలో రాజకీయాలలోకి వచ్చారు ఆమె. ఉపఎన్నికలలో ఎమ్మెల్యే అయ్యి ఆ తరువాత తండ్రి భూమా నాగిరెడ్డితో పాటు వైకాపా వీడి టీడీపీ చేరారు. 2017లో ఆయన అకాల మరణం చెందడంతో ఆవిడకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది టీడీపీ ప్రభుత్వం. నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉపఎన్నికలో అఖిలప్రియ తమ్ముడు బ్రహ్మానందరెడ్డి భారీ మెజారిటీతో గెలిపించుకోవడంతో ఆవిడ ప్రాముఖ్యత పెరిగింది.

కర్నూల్ రాజకీయాలలో వర్గ పోరును పెంచి పోషిస్తున్నారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి సొంత మనుషులు కూడా ఆమెతో ఇబ్బంది పడటం గమనార్షం. ఈ క్రమంలో అఖిలప్రియ పార్టీ మారితే ఎక్కడకి వెళ్తారనేది కూడా చూడాల్సి ఉంది. గతంలో భూమా దంపతులు ప్రజారాజ్యంలో పని చేశారు. ఇప్పుడు ఆ చనువుతో పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్తారా అనేది చూడాలి. జగన్ తో విభేదించి బయటకు వచ్చిన కారణంగా మళ్ళీ వైకాపాకు వెళ్ళే అవకాశాలు తక్కువనే చెప్పుకోవాలి.

అనూహ్యంగా రాజకీయాలలోకి వచ్చి అతి చిన్నవయసులోనే మంత్రిగా ఎదిగిన ఆమె ఇటువంటి కీలక తరుణంలో ఏం చేయ్యబోతున్నారో చూడాలి. ఒకవేళ 2019లో గనుక ఓడిపోతే దానికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కర్నూల్ రాజకీయాల నుండి మొత్తానికి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. రాయలసీమలో జనసేన బలంపై ఇప్పటికే ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆ పార్టీలో చేరడం అంటే అది పెద్ద రిస్క్ అనే చెప్పుకోవాలి.