Bhuma Akhila Priyaనంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పట్టణంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు శనివారం ఉదయం నుంచి గృహనిర్బందం చేశారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి ఆమెపై తీవ్ర ఆరోపణలు చేయడంతో, ఆమె కూడా ప్రతిసవాల్ విసిరారు. దమ్ముంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి నంద్యాలలోని గాంధీ జంక్షన్ వద్దకు రావాలని, అక్కడ ఆయన ఎదుటే ఆయన చేసిన అవినీతి, అక్రమాలని సాక్ష్యాధారాలతో సహా బయటపెడతానని భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు.

దీంతో పట్టణంలో శాంతిభద్రతల సమస్య వస్తుంది కనుక ఆమె బహిరంగ చర్చకి అనుమతి లేదని, కనుక శనివారం ఆమెని గృహ నిర్బందం చేయబోతున్నట్లు ఆళ్ళగడ్డ డీఎస్పీ సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి ఆమె వ్యక్తిగత కార్యదర్శికి తెలియజేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఈరోజు ఉదయమే భూమా అఖిలప్రియ ఇంటి ముందు భారీగా పోలీసులని మోహరించి ఆమెని గృహ నిర్బందం చేశారు. ఆళ్ళగడ్డలో ఆమె నివాసం వైపు టిడిపి కార్యకర్తలు ఎవరూ వెళ్ళకుండా అన్ని వైపులా బ్యారీకేడ్లతో రోడ్లు బ్లాక్ చేసారు.

పోలీసుల చర్యని ఆమె తీవ్రంగా ఖండించారు. అవినీతికి పాల్పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయకుండా, అతని అవినీతిని బయటపెడతానని చెప్పినందుకు తనని గృహ నిర్బందం చేయడం ఏమిటని భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. ఈరోజు కాకపోతే రేపైనా వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి అవినీతిని, అక్రమాలని తప్పకుండా బయటపెడతానని ఆమె అన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితేనే ఆయనకి రాష్ట్ర మహిళా కమీషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మావతి నోటీస్ ఇచ్చి సంజాయిషీ కోరారు. ఓ ప్రజా ప్రతినిధి అవినీతిని బయటపెట్టేందుకు ప్రయత్నించిన మహిళా నేతని పోలీసులు గృహ నిర్బందం చేస్తే ఎందుకు స్పందించడం లేదు?