Bhuma Akhila Priya Arrestమాజీ మంత్రి భూమా అఖిల ప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కిడ్నాప్ కేసులో ఆమెతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ప్రమేయం ఉన్నట్టు పోలీసుల ఆరోపణ. అఖిలప్రియ అరెస్ట్ కాగా ఆమె భర్త పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కిడ్నపైన వారు సీఎం కేసీఆర్‌ సోదరి తరఫు సమీప బంధువులు కావడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు.

కిడ్నపైన ముగ్గురూ సీఎం కేసీఆర్‌ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. స్వర్గీయ భూమానాగి రెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి రాజకీయ వారసురాలిగా వచ్చిన ఆమె ఇప్పుడు పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. గత ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఓడిపోయినప్పటికీ.. రాజకీయంగా చురుగ్గానే ఉన్నారు. ఆమెపై పలు వివాదాలు వచ్చాయి.

భూమా నాగిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న సుబ్బారెడ్డిని చంపించడానికి ఆమె సుపారీ ఇచ్చారని సుబ్బారెడ్డి నేరుగా మీడియా ఎదుట ఆరోపించారు. ఆ తర్వాత నంద్యాల నియోజకవర్గంలోనూ జరిగిన ఓ హత్య విషయంలో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీకి తలపోటుగా పరిణమించారు.

నాగిరెడ్డి మరణం తరువాత చంద్రబాబు ఆమె చిన్న వయసైనా మంత్రిని చేశారు. నాగిరెడ్డి సీటు కూడా ఆమె కోరినట్టుగానే ఇచ్చారు. అయితే నియోజకవర్గంలోని సొంత పార్టీ వారిని కూడా కలుపుకుపోవడం, అనేక వివాదాల్లో తరచు ఇరుకోవడంతో ఆమె ఓడిపోవడంతో పాటు జిల్లాలో కూడా పార్టీని నష్టపరిచారు. అయితే ప్రతిపక్షంలో ఉండగా ఆమెపై చంద్రబాబు చర్య తీసుకునే సాహసం చేస్తారా?