మరికొద్ది గంటల్లో “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కాబోతోంది. రెండు రోజుల క్రితం బండ్ల గణేష్ – అభిమానుల నడుమ జరిగిన సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్న ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ ప్రసంగానికి అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది.

ఈ వేడుకలో బండ్ల గణేష్ పాల్గొనబోవడం లేదనేది స్పష్టం. కానీ ఈ ఈవెంట్ కోసం ఓ అద్భుతమైన స్పీచ్ ను రాసుకున్నాను, తన పేరును అభిమానులంతా పలకండి అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు బండ్ల పిలుపునిచ్చారు. దీంతో ‘భీమ్లా’ ఈవెంట్ లో పవన్ నామస్మరణ కాకుండా బండ్ల పేరు పలికితే, అది ఖచ్చితంగా చిత్ర యూనిట్ కు అవమానకరమే. ముఖ్యంగా త్రివిక్రమ్ కు అని చెప్పాలి.

ఒకవేళ బండ్ల స్పీచ్ ని మైమరిపించే విధంగా త్రివిక్రమ్ తన స్పీచ్ ను రాసుకొస్తే అభిమానులు కాస్త శాంతించే అవకాశాలు ఉన్నాయి. దీంతో “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కత్తి మీద సాము అని పేర్కొనవచ్చు. ఎందుకంటే పవన్ వేడుకలలో ఎవరు ఎలా వ్యాఖ్యానించినా, ఫ్యాన్స్ మాత్రం బండ్ల గణేష్ స్పీచ్ కోసం కాసుకుని కూర్చుంటారు.

ఇక పవన్ ప్రసంగం కోసం కూడా అభిమానులంతా నిరీక్షిస్తున్నారు. ఏపీలో టికెట్ ధరలు మరియు బెనిఫిట్ షోలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. టికెట్ ధరల జీవో ఎలాగూ రాదు గానీ, కనీసం బెనిఫిట్ షోలకైనా అనుమతులు ఏపీ సర్కార్ ఇస్తుందని ఫ్యాన్స్ భావించారు గానీ, ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందించలేదు.

దీంతో జగన్ ను ఉద్దేశించి పవన్ ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారు? అసలు స్పందిస్తారా? లేక సైలెంట్ గా వదిలేస్తారా? అన్నది కూడా వేచిచూడాలి. లేక ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్న కేటీఆర్ ను ఆకాశంలోకి ఎత్తేసి, పరోక్షంగా జగన్ పై తనకున్న భావనను వ్యక్తపరుస్తారా? ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలతో “భీమ్లా నాయక్” వేడుక ముడిపడి ఉంది.